CDS: నూతన సీడీఎస్‌గా అనిల్‌ చౌహాన్‌ నియామకం

హెలికాప్టర్‌ ప్రమాదంలో జనరల్‌ బిపిన్‌ రావత్‌ మరణంతో దాదాపు తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉన్న చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌).....

Updated : 28 Sep 2022 19:29 IST

దిల్లీ: హెలికాప్టర్‌ ప్రమాదంలో జనరల్‌ బిపిన్‌ రావత్‌ మరణంతో దాదాపు తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉన్న చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) పదవిని కేంద్రం భర్తీ చేసింది. నూతన సీడీఎస్‌గా విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ని నియమించింది. బిపిన్‌ రావత్‌ మరణం తర్వాత ఈ సైనిక అత్యున్నత పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై కేంద్రం సుదీర్ఘంగా కసరత్తు చేసిన అనంతరం తదుపరి సీడీఎస్‌గా అనిల్‌ చౌహాన్‌ను ఎంపిక చేసింది. దీంతో దేశ రెండో సీడీఎస్‌గా చౌహాన్‌ నియమితులయ్యారు. లెఫ్టినెంట్‌ జనరల్‌ చౌహాన్‌ ఈస్టర్న్‌ కమాండ్‌ చీఫ్‌గా 2021 మే నెలలో పదవీ విరమణ చేశారు. దాదాపు తన 40 ఏళ్ల కెరీర్‌లో అనిల్ చౌహాన్ సైన్యంలోని అనేక హోదాల్లో పనిచేశారు. జమ్మూకశ్మీర్‌, ఈశాన్య భారతదేశంలో తిరుగుబాటు కార్యకలాపాలను నిరోధించడంలో ఆయనకు విస్తృతమైన అనుభవం ఉంది. 

మరోవైపు, అనిల్‌ చౌహాన్‌ను సీడీఎస్‌గా నియమిస్తున్నట్టు కేంద్ర రక్షణమంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. ‘‘విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ను తదుపరి సీడీఎస్‌గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.  సీడీఎస్‌ బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన భారత ప్రభుత్వ సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగానూ పనిచేస్తారు’’ అని పేర్కొంది. 

గతేడాది డిసెంబర్‌ 8న తమిళనాడులోని కోయంబత్తూర్​-కూనూర్​ మధ్యలో జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో జనరల్‌ బిపిన్​ రావత్‌, ఆయన సతీమణితో పాటు 13మంది మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం రేపింది. అయితే, ఆ దుర్ఘటన నుంచి గాయాలతో బయటపడిన ఎయిర్‌ఫోర్స్‌ గ్రూప్‌ కెప్టెన్‌ ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని