Kiren Rijiju: మా పాత్ర పరిమితమే.. కిరణ్‌ రిజిజు కీలక వ్యాఖ్యలు

దేశంలో పెండింగ్‌ కేసులు 5 కోట్లు దాటడంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju) ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కారణం.. న్యాయస్థానాల్లో జడ్జీల నియామకాలు ఆలస్యంగా జరుగుతుండటమే అని అన్నారు. 

Published : 15 Dec 2022 23:56 IST

దిల్లీ: కొలీజియం (collegium) వ్యవస్థలపై సుప్రీంకోర్టు (Supreme Court), కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం సాగుతోన్న వేళ.. న్యాయమూర్తుల నియామకాల అంశంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju) కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులను నియమించడంలో ప్రభుత్వానిది పరిమితమైన పాత్రే అని అన్నారు. దేశంలో పెండింగ్‌ కేసులపై పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉండటం ఆందోళనకరమన్నారు. అయితే ఇందుకు ప్రధాన కారణం.. న్యాయమూర్తుల నియామకాలేనని తెలిపారు. ‘‘పెండింగ్‌ కేసుల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. కానీ, కోర్టుల్లో జడ్జీల ఖాళీలను భర్తీ చేయడంలో కేంద్రం పాత్ర చాలా తక్కువ పరిమితితో కూడుకున్నది. కొలీజియమే (collegium) న్యాయమూర్తుల పేర్లను ప్రతిపాదిస్తుంది. అందులోని వ్యక్తులను కాకుండా వేరే వారిని నియమించే హక్కు ప్రభుత్వానికి లేదు’’ అని రిజిజు వివరించారు. ఈ సందర్భంగా 2014లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్‌ జ్యుడిషియల్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిషన్‌(NJAC) చట్టాన్ని 2015లో సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయాన్ని కూడా రిజిజు ప్రస్తావించారు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో మార్పులు జరగనంతవరకు.. కోర్టుల్లో ఖాళీల సమస్య వేధిస్తూనే ఉంటుందని న్యాయశాఖ మంత్రి అభిప్రాయపడ్డారు.

కొలీజియం నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court), కేంద్ర ప్రభుత్వం మధ్య అభిప్రాయభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. కొలీజియం వ్యవస్థపై రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న కొందరు వ్యాఖ్యలు చేయగా.. సర్వోన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. కొలీజియం వ్యవస్థ.. ఈ దేశం రూపొందించిన చట్టమని.. దీన్ని తప్పనిసరిగా పాటించాల్సిందేనని, ఇందులో రెండో అభిప్రాయానికి తావు లేదని కేంద్రానికి స్పష్టం చేసింది. అంతేగాక, కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను ఆమోదించడంలో కేంద్రం చేస్తోన్న జాప్యంపైనా అసహనం వ్యక్తం చేసింది. ఈ వివాదం వేళ.. రిజిజు చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని