Shocking: షాకింగ్‌.. డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి ప్రభుత్వ ఉద్యోగి మృతి!

డ్యాన్స్‌ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి మృతిచెందిన ఘటన భోపాల్‌లో చోటుచేసుకుంది.

Published : 21 Mar 2023 01:42 IST

భోపాల్‌: అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కొందరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. డ్యాన్స్, వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు విడుస్తున్న షాకింగ్‌ ఘటనలు తీవ్ర కలవరపెడుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో  ఓ ప్రభుత్వ ఉద్యోగి డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి మృతిచెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. తపాలా శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసే సురేంద్ర కుమార్‌ దీక్షిత్‌ అనే వ్యక్తి  ఓ ఈవెంట్‌లో డ్యాన్స్‌ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనకు సడెన్‌గా గుండెపోటు రావడం వల్లే మృతిచెందినట్టు సమాచారం. దీనికి సంబంధించిన సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తన స్నేహితులతో కలిసి ఓ సాంగ్‌కు డ్యాన్స్‌ చేస్తూ ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆయన చుట్టూ చేరిన మిగతా వారు సాయం చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

తపాలా శాఖ మార్చి 13 నుంచి 17వరకు 34వ ఆల్‌ ఇండియా పోస్టల్‌ హాకీ టోర్నమెంట్‌ను భోపాల్‌లోని మేజర్‌ ధ్యాన్‌చంద్‌ హాకీ స్టేడియంలో నిర్వహించింది. ఆఖరి మ్యాచ్‌ మార్చి 17న  జరగనుండటంతో.. మార్చి 16న కార్యాలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ  నేపథ్యంలోనే ఓ పాటకు తోటి ఉద్యోగులతో కలిసి నృత్యం చేసిన ఆయన ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచారు. 

మరోవైపు, ఈ ఏడాది జనవరిలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 16 ఏళ్ల బాలిక గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. చల్లని వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక 11వ తరగతి చదువుతున్న వ్రిందా త్రిపాఠి.. స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. రిపబ్లిక్‌డే ఈవెంట్స్‌లో భాగంగా రిహార్సల్స్‌ కోసం వెళ్లిన బాలిక తన పాఠశాలలోనే కుప్పకూలిపోయింది. దీంతో ఆస్పత్రికి తరలించగా వైద్యులు సీపీఆర్‌ చేసినా ఫలితం లేకపోయింది. బాలికను ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని