Covid: పెరిగిన కేసులు, మరణాలు.. అయిదు రాష్ట్రాలకు కేంద్రం లేఖ

దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉందని ఊరట చెందుతున్న సమయంలో.. ఒమిక్రాన్ ఆందోళన మొదలైన విషయం తెలిసిందే. ఇదే తరుణంలో రోజురోజుకి కొత్త కేసులు, మరణాల సంఖ్య వేగంగా పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం శనివారం ఒడిశా...

Updated : 23 Feb 2024 19:25 IST

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉందని ఊరట చెందుతున్న సమయంలో.. ఒమిక్రాన్ ఆందోళన మొదలైన విషయం తెలిసిందే. ఇదే తరుణంలో రోజురోజుకి కొత్త కేసులు, మరణాల సంఖ్య వేగంగా పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం శనివారం ఒడిశా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మిజోరాం, జమ్మూ-కశ్మీర్‌లకు లేఖ రాసింది. హాట్‌స్పాట్‌లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అందులో సూచించింది. దీంతోపాటు విదేశీ రాకపోకలు, ముఖ్యంగా 'రిస్క్' దేశాలనుంచి వస్తున్న ప్రయాణికులపై దృష్టి సారించాలని, పాజిటివ్‌ వచ్చినవారి శాంపిళ్లను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌కు పంపాలని పేర్కొంది.

ఈ ప్రాంతాల్లో పెరిగిన తీవ్రత..

జమ్మూ-కశ్మీర్‌లోని కథువా జిల్లాలో నవంబర్ 26- డిసెంబర్ 2 మధ్య గత వారంతో పోల్చితే.. కొత్త కేసుల్లో 727 శాతం పెరుగుదల నమోదు కావడం గమనార్హం. అదే సమయంలో కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోనూ కేసులు 152 శాతం పెరిగాయి. తమిళనాడులోని మూడు, ఒడిశాలోని ఆరు, మిజోరాంలోని నాలుగు జిల్లాల్లోనూ కేసుల సంఖ్య భారీగా పెరిగిందని కేంద్రం హెచ్చరించింది.

కేరళలో కొవిడ్ మరణాల సంఖ్య పెరగడంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. నవంబర్ 19- 25 మధ్య త్రిసూర్ జిల్లాలో 12 మరణాలు నమోదు కాగా, ఆ తరువాతి వారంలో 128కి ఎగబాకింది. అదే సమయంలో మళప్పురం జిల్లాలోనూ 70, ఆ తర్వాతి వారంలో 109 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఒమిక్రాన్‌ కలవరం నెలకొన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సంబంధిత రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని