Mamata Banerjee: అగ్గి రాజేసిన ‘వీధి న్యాయం’... మమతపై గవర్నర్‌ ఘాటు వ్యాఖ్యలు

ఇటీవల పశ్చిమబెంగాల్‌లోని చోప్రాలో ఓ వ్యక్తితోపాటు మహిళను నడిరోడ్డుపై చావబాదిన ఘటన రాష్ట్రంలో అగ్గి రాజేస్తోంది. గవర్నర్‌ ఆనంద్‌బోస్‌, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Updated : 02 Jul 2024 19:50 IST

కోల్‌కతా: అక్రమ సంబంధం ఆరోపణతో ఓ వ్యక్తితో పాటు మహిళను నడి రోడ్డుపై చావబాదిన ఘటన పశ్చిమబెంగాల్‌లో (West Bengal) అగ్గి రాజేస్తోంది. దీనిని కారణంగా చూపుతూ.. గవర్నర్‌ ఆనంద్‌ బోస్‌ (Anand Bose).. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై (Mamata Benarjee) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఎంబీ కాక్‌టైల్‌’తో రాష్ట్రంలో శాంతిభద్రతలు కొరవడుతున్నాయని విమర్శించారు. తొలుత బాధితురాలని పరామర్శించేందుకు ఆమె ఇంటికి వెళ్లాలని నిర్ణయించిన గవర్నర్‌.. పోలీసుల సూచన మేరకు ఆగిపోయారు. బాధితురాలు ప్రస్తుతం ఒంటరిగా ఉండాలని కోరుకుంటోందని అధికారులు తెలియజేయడంతో ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. ‘‘ బాధిత మహిళ ఎవరినీ కలవకుండా ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నట్లు సమాచారం అందింది. ఆమె నిర్ణయాన్ని గౌరవించి నేను వెళ్లలేదు. ఆమె రాజ్‌భవన్‌కు ఎప్పుడైనా రావొచ్చు. లేదంటే నేను వెళ్లేందుకైనా సిద్ధమే’’ అని గవర్నర్‌ మీడియాకు తెలిపారు.

ఇటీవల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల బాధితులను చాలా మందిని కలిశానని, వారితో మాట్లాడినప్పుడు వారు తమ బాధలు తనతో పంచుకున్నారని గవర్నర్‌ తెలిపారు. వారందరి మాటలు విన్న తర్వాత సీఎం మమతా బెనర్జీ సారథ్యంలో నడుస్తున్న ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని అర్థమైందన్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో దుర్భర పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ధనబలం, రాజకీయ బలం, ప్రభుత్వం అండతో సంఘ వ్యతిరేక శక్తులు పేట్రేగిపోతున్నాయని విమర్శించారు. మమతా బెనర్జీని ఉద్దేశిస్తూ.. ‘ఎంబీ కాక్‌టెయిల్‌’  బెంగాల్‌ పరిస్థితిని దెబ్బతీస్తోంది. హింస ఆనవాయితీగా మారింది. దీనికి హోం మంత్రి, పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. పౌరుల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనన్న సంగతి పాలకులు గుర్తుంచుకోవాలి’’ అని విమర్శించారు.

ఆరోపణలెందుకు.. బిల్లులు ఆమోదించండి: తృణమూల్‌

మరోవైపు గవర్నర్‌ వ్యాఖ్యలను తృణమూల్‌ కీలక నేత కునాల్‌ ఘోష్‌ తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై చౌకబారు విమర్శలు చేశారని అన్నారు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి భాష ఉపయోగించడం సరికాదన్నారు. సీఎంను విమర్శించడమే పనిగా పెట్టుకోకుండా.. గతంలో అసెంబ్లీ రూపొందించిన బిల్లులను ఆమోదించి ఉంటే.. ఈ తరహా ఘటనలు చోటు చేసుకొని ఉండేవి కాదని, ఒక వేళ జరిగినా శిక్షలు చాలా కఠినంగా ఉండేవని అన్నారు.  తాజా ఘటనపై అధికార పక్షానికి చెందిన స్థానిక ఎమ్మెల్యే రెహ్మన్‌.. తన అనుచరుడైన తేజ్ముల్‌ను వెనకేసుకొచ్చారు. పార్టీ అధికార ప్రతినిధి శాంతను సేన్‌ మాట్లాడుతూ.. చోప్రా తరహా ఘటనలను ఎట్టిపరిస్థితుల్లోనూ తృణమూల్‌ పార్టీగానీ, ప్రభుత్వంగానీ సహించబోదని చెప్పారు. ఇప్పటికే నిందితుడిపై కేసు నమోదైందని, చట్టప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఇటీవల ఉత్తర్‌దీనాజ్‌పుర్‌లోని చోప్రాలో మహిళతోపాటు మరో వ్యక్తిని నడిరోడ్డుపై చావబాదిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో సుమోటోగా తీసుకున్న పోలీసులు నిందితుడు తేజ్ముల్‌ అలియాస్‌ జేసీబీని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఏదైనా వివాదం తన దగ్గరకు వస్తే అప్పటికప్పుడు నచ్చినట్లు తీర్పు చెప్పి.. నడి రోడ్డుపై భౌతికంగా హింసిస్తాడని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అక్రమ సంబంధం కారణంగానే వీరిద్దరినీ కొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఈ క్రమంలో అసెంబ్లీలో భాజపా ప్రతిపక్షనేత సువేందు అధికారి మరోవీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ కేసులోనూ తేజ్ముల్‌ నిందితుడేనని పేర్కొన్నారు. చోప్రా ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని గవర్నర్‌ ప్రభుత్వాన్ని ఆదేశించారు. మరోవైపు దీనిపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు జాతీయ మహిళా కమిషన్‌ కూడా లేఖ రాసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని