1 నుంచి ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ విక్రయం.. 2 రాష్ట్రాల ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం

గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీలు సమీపిస్తున్న వేళ ఎన్నికల బాండ్లను కేంద్రం విక్రయానికి ఉంచింది. 22వ విడత ఎలక్ట్రోరల్‌ బాండ్ల విక్రయాలు అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.

Published : 29 Sep 2022 19:40 IST

దిల్లీ: గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీలు సమీపిస్తున్న వేళ ఎన్నికల బాండ్లను కేంద్రం విక్రయానికి ఉంచింది. 22వ విడత ఎలక్ట్రోరల్‌ బాండ్ల విక్రయాలు అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన 29 అధీకృత శాఖల్లో అక్టోబర్‌ 1 నుంచి 10వ తేదీ వరకు ఈ బాండ్లను కొనుగోలు చేయొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

పార్టీలకు చెల్లించే నిధుల్లో పారదర్శకత కల్పించాలనే ఉద్దేశంతో 2018లో నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశపెట్టింది. దీని కింద ఎన్నికల సంఘం ఆమోదించిన ఖాతా ద్వారా మాత్రమే ఆయా రాజకీయ పార్టీలకు నిధులు వెళ్తాయి. అర్హత కలిగిన రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చాలని భావించే వ్యక్తులు/సంస్థలు/కంపెనీలు ఈ బాండ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జారీ అయిన తేదీ నుంచి 15 రోజుల వరకే ఇవి చెల్లుబాటవుతాయి. ఎస్‌బీఐకి చెందిన లఖ్‌నవూ, శిమ్లా, దేహ్రాదూన్‌, కోల్‌కతా, గువాహటి, చెన్నై, పట్నా, దిల్లీ, చండీగఢ్‌, శ్రీనగర్‌, గాంధీనగర్‌, భోపాల్‌, రాయ్‌పూర్‌, ముంబయి శాఖల్లో ఎన్నికల బాండ్లు విక్రయించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 8న హిమాచల్‌ ప్రదేశ్‌, ఫిబ్రవరి 18న గుజరాత్‌ అసెంబ్లీ గడువు ముగియనుంది. దీంతో ఈ రెండు రాష్ట్రాలకు ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని వారాల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఈ ఏడాది జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు కూడా కేంద్రం ఎలక్ట్రోరల్‌ బాండ్లను విక్రయానికి ఉంచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని