Fortified Rice: రేషన్‌లో ఇక ఫోర్టిఫైడ్‌ రైస్‌.. కేంద్ర కేబినెట్‌ ఆమోదం

పేదలకు బలవర్థక ఆహారం అందించే లక్ష్యంగా కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ఇకపై ఫోర్ట్‌ఫైడ్‌ రైస్‌ (బలవర్థక బియ్యం) అందించాలని నిర్ణయించింది.

Updated : 08 Apr 2022 21:38 IST

దిల్లీ: పేదలకు బలవర్థక ఆహారం అందించే లక్ష్యంగా కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ఇకపై ఫోర్టిఫైడ్‌ రైస్‌ (బలవర్థక బియ్యం) అందించాలని నిర్ణయించింది. మూడు దశల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రధాని మోదీ నేతృత్వంలో శుక్రవారం జరిగిన మంత్రిమండలి నిర్ణయించింది. సమావేశం అనంతరం కేబినెట్‌ నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వెల్లడించారు.

తొలి దశలో ఐసీడీఎస్‌, పీఎం పోషణ్‌ ప్రోగ్రాముల కింద ఈ బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. రెండో దశలో లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ (TPDS), 291 వెనుకబడిన జిల్లాల్లో అన్ని సంక్షేమ పథకాల్లో ఈ బియ్యాన్ని సరఫరా చేయనున్నారు. 2023 మార్చి నాటికి రెండో దశ పూర్తి చేయనున్నారు. మూడో దశలో భాగంగా 2024 మార్చి నాటికి మిగిలిన అన్ని జిల్లాల్లో ఈ బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. ఏడాదికి రూ.2700 కోట్లు రైస్‌ ఫోర్టిఫికేషన్‌ కోసం ఖర్చవుతుందని, ఆ మొత్తాన్ని కేంద్రమే భరిస్తుందని పేర్కొన్నారు.

గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజు తొలిసారి ఫోర్టిఫికేషన్‌ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. మహిళలు, పిల్లలు, పాలిచ్చే తల్లులు పోషకారహార లోపాన్ని అధిగమించడానికి గానూ ఈ బియ్యాన్ని అందిచనున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ పథకం అమలు కోసం బియ్యం ఫోర్టిఫికేషన్‌, ప్రజా పంపిణీ వ్యవస్థ కింద పంపిణీ పరిశీలనకు 11 రాష్ట్రాల్లో ఒక్కో జిల్లాలో మూడేళ్లుగా పైలట్‌ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేస్తున్నారు.

ఫోర్టిఫికేషన్‌ అంటే..?
ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు బియ్యానికి అదనంగా చేర్చితే ఫోర్టిఫికేషన్‌ అంటారు. ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి12 లాంటివి కలిపి పోషక విలువలున్న మిశ్రమంతో ఫోర్టిఫైడ్‌ బియ్యం రూపు దిద్దుకుంటాయి. గర్భిణులు, బాలింతలు, పిల్లలు పోషకాహార లోపం, రక్తహీనతను అధిగమించేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని