టీకా ధరలు తగ్గించండి: కేంద్రం

టీకా ధరలను తగ్గించాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌ సంస్థలను కేంద్ర ప్రభుత్వం కోరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

Updated : 27 Apr 2021 10:13 IST

సీరం, భారత్‌ బయోటెక్‌లను కోరిన కేంద్రం

దిల్లీ: భారత్‌లో ఉత్పత్తి అవుతోన్న కరోనా వ్యాక్సిన్‌ మన దేశంలో సరఫరా చేసే ధరను ఇప్పటికే ఆయా సంస్థలు ప్రకటించాయి. అయితే, కేంద్ర ప్రభుత్వానికి అందిస్తోన్న ధరలతో పోలిస్తే రాష్ట్రాలకు, ప్రైవేటు ఆస్పత్రులకు ఎక్కువ ధర నిర్ణయించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో టీకా ధరలను తగ్గించాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌ సంస్థలను కేంద్ర ప్రభుత్వం కోరింది. కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గౌబా అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో వ్యాక్సిన్‌ల ధరపై చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో తర్వలోనే ఆ రెండు కంపెనీలు ధరలు సవరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

దేశవ్యాప్తంగా మే 1వ తేదీ నుంచి 18ఏళ్ల వయసుపైబడిన వారందరికీ టీకా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అంతేకాకుండా టీకా తయారీ సంస్థల నుంచి ఆయా రాష్ట్రాలు నేరుగా కొనుగోలు చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ సమయంలో ఆయా రాష్ట్రాలకు, ప్రైవేటు సంస్థలకు అందించే ధరను టీకా తయారీ సంస్థలు వెల్లడించాయి. అయితే, కేంద్ర ప్రభుత్వంతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు టీకా ధరను ఎక్కువగా నిర్ణయించగా..ప్రైవేటు సంస్థలకు మరింత ఎక్కువ ధరకు విక్రయిస్తామని పేర్కొన్నాయి. కరోనా విజృంభణతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ టీకా సంస్థలు లాభాలు ఎందుకు ఆశిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ధరలు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

దిలాఉంటే, భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ టీకాను రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతి డోసుకు రూ.600గా నిర్ణయించగా, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.1200గా నిర్ణయించింది. ఇక సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేస్తోన్న టీకా డోసు రాష్ట్రాలకు రూ.400గా, ప్రైవేటుకు రూ.600గా నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు సంస్థలూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతి డోసుకు దాదాపు రూ.150 చొప్పున మాత్రమే అందిస్తున్నాయి. వేర్వేరు ధరలపై రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో ధరలు తగ్గించాలని ఆయా సంస్థలను కేంద్రం కోరినట్టు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని