దేశం దుఃఖిస్తుంటే.. సానుకూల ప్రచారమా?

దేశవ్యాప్తంగా కొవిడ్‌ విజృంభణ ఆందోళన కలిగిస్తున్న వేళ ‘సానుకూల ఆలోచనా ధోరణి’ పేరిట భాజపా చేస్తున్న ప్రచారం కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను........

Published : 12 May 2021 14:48 IST

కేంద్రంపై ధ్వజమెత్తిన రాహుల్‌, ప్రశాంత్‌ కిశోర్‌

దిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్‌ విజృంభణ ఆందోళన కలిగిస్తున్న వేళ ‘సానుకూల ఆలోచనా ధోరణి’ పేరిట భాజపా చేస్తున్న ప్రచారం కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను అపహాస్యం చేయడమేనని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అభిప్రాయపడ్డారు. ‘‘సానుకూల ఆలోచన పేరిట ఇచ్చే ధీమా.. కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలు, వైద్యారోగ్య సిబ్బంది, ఆక్సిజన్‌, ఔషధాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని అపహాస్యం చేయడమే. ఒకరి తలను ఇసుకలో ముంచడం సానుకూలమైన అంశం కాదు- మన పౌరులకు ద్రోహం చేయడమే’’ అని రాహుల్‌ ట్విటర్‌ వేదికగా వ్యాఖ్యానించారు.

దేశంలో కరోనా రెండో దశ తీవ్ర ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ, వ్యవస్థ వైఫల్యాలను ఎత్తిచుపుతూ కేంద్రంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో కేవలం సానుకూల అంశాలను మాత్రమే ప్రచారం చేయాలని ప్రభుత్వం, భాజపా నిర్ణయించినట్లు ఓ హిందీ పత్రిక కథనాన్ని ప్రచురించింది. అందులో భాగంగా రోజువారీ కరోనా కేసుల బులెటిన్‌లో పాజిటివ్‌ కేసులకు బదులు కేవలం నెగెటివ్‌ కేసుల్ని మాత్రం ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు పత్రిక కథనం పేర్కొంది. దీన్ని ఉద్దేశించి రాహుల్‌ గాంధీ తాజా వ్యాఖ్యలు చేశారు.

 

మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సైతం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. యావత్తు దేశం దుఃఖిస్తుండగా.. రోజుకి అనేక విషాదకర ఘటనలు వెలుగులోకి వస్తుండగా.. సానుకూల ఆలోచనల పేరిట అసత్యాల్ని, తమకు అనుకూల అంశాల్ని ప్రచారం చేయడం అసహ్యకరమైన విషయం అని వ్యాఖ్యానించారు. సానుకూలంగా ఉండాలనుకుంటే.. గుడ్డిగా ప్రభుత్వానికి అనుకూల ప్రచారం చేయాల్సిన అవసరం లేదు అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని