Precaution dose: త్వరలో వారికీ ప్రికాషన్ డోసు టీకాలు..!

కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా టీకా పంపిణీని విస్తరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే 12-14, 15-18 ఏళ్ల వారికి దశల వారీగా వ్యాక్సినేషన్‌తో పాటు ఆరోగ్య కార్యకర్తలు

Published : 27 Mar 2022 01:37 IST

దిల్లీ: కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా టీకా పంపిణీని విస్తరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే 12-14, 15-18 ఏళ్ల వారికి దశల వారీగా వ్యాక్సినేషన్‌తో పాటు ఆరోగ్య కార్యకర్తలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ప్రికాషన్‌ డోసులు అందిస్తోంది. తాజాగా ఈ ప్రికాషన్‌ డోసు పరిధిని పెంచేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే విద్య, ఉద్యోగాలు, ఇతర కారణాలతో విదేశాలకు వెళ్లే వారికి అతి త్వరలోనే ముందస్తు టీకా పంపిణీని ప్రారంభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక వర్గాలు శనివారం వెల్లడించాయి. 

కరోనా మహమ్మారి అదుపులోకి వస్తుండటంతో ఆదివారం (మార్చి 27) నుంచి పూర్తిస్థాయి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఆంక్షల సడలింపులో భాగంగా ఇటీవల కొన్ని దేశాలు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మూడో డోసు లేదా బూస్టర్‌ డోసును తప్పనిసరి చేశాయి. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ.. ఆరోగ్య శాఖ దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే విదేశాలకు వెళ్లే వారికి ప్రికాషన్‌ డోసు పంపిణీ అంశాన్ని ఆరోగ్యశాఖ పరిగణనలోకి తీసుకున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.

‘‘ఉన్నత విద్య, ఉద్యోగాలు, క్రీడా టోర్నమెంట్‌లు, వ్యాపార సమావేశాలు, అధికారిక కార్యక్రమాల కోసం విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు ప్రికాషన్ డోసు ఇచ్చే అంశాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ పరిశీలిస్తోంది’’ అని అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి అధికారిక ప్రకటన రానప్పటికీ.. త్వరలోనే ఈ పంపిణీ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది జనవరి 10 నుంచి ఆరోగ్య కార్యకర్తలు, 60 ఏళ్లు పైబడి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ ప్రికాషన్‌ డోసు పంపిణీని ప్రారంభించిన విషయం తెలిసిందే. రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తయిన వారికి ఈ డోసును అందిస్తున్నారు. అయితే ఇటీవల మార్చి 16 నుంచి 60 ఏళ్లు పైబడిన అందరూ ముందస్తు డోసుకు అర్హులేనని కేంద్రం ప్రకటించింది. ఇక జనవరి 3 నుంచి 15-18 ఏళ్లవారికి కరోనా టీకాను ప్రారంభించగా.. మార్చి 16 నుంచి 12-14 ఏళ్ల వారికి కూడా టీకా పంపిణీ ప్రారంభించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని