
Vaccine for animals: జంతువులకూ వ్యాక్సినేషన్.. త్వరలో క్లినికల్‌ట్రయల్స్!
దిల్లీ: ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్.. జంతువులకూ సోకుతున్న విషయం తెలిసిందే. తాజాగా చెన్నైలోని ఓ జూలో రెండు సింహాలు కరోనా బారిన పడి మృతి చెందాయి. ఈ నేపథ్యంలో జంతువులకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు హరియాణాలోని ఐసీఏఆర్-నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్ (ఎన్‌ఆర్‌సీఈ) సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌తో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.
త్వరలోనే దేశవ్యాప్తంగా ఉన్న ఆరు జూలలో ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించబోతున్నారు. కేవలం సింహాలు, పులులు, చిరుతపులులకు మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. రెండు డోసుల మధ్య వ్యవధిని 28 రోజులుగా నిర్ణయించారు. జంతువుల కోసం వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయాలని ఐసీఏఆర్-ఎన్‌ఆర్‌సీఈకు పర్యావరణ, అటవీశాఖ ఇటీవల ఆదేశాలిచ్చింది. ఒక జాతికి చెందిన జంతువులు 15కి మించి ఉన్న జూల్లోనే ఈ ట్రయల్స్ నిర్వహించాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే ట్రయల్స్ ప్రారంభించనున్నట్లు సమాచారం. తొలిసారిగా 2020 ఏప్రిల్‌లో న్యూయార్క్‌లోని బ్రోనెక్స్ జూలో జంతువులకు కరోనా వైరస్ సోకినట్లు నిర్థరణ అయింది. భారత్‌లో గతేడాది హైదరాబాద్‌లోని జూలాజికల్ పార్క్‌లో ఎనిమిది సింహాలు కరోనా బారిన పడ్డాయి.