India: అఫ్గాన్‌లో ఎంబసీ మూసివేయడం లేదు..కానీ!

అఫ్గానిస్థాన్‌లో రాయబార కార్యాలయం, కాన్సులేట్‌లు ప్రస్తుతానికి యథావిధిగా పనిచేస్తాయని భారత విదేశాంగశాఖ ప్రకటించింది.

Published : 06 Jul 2021 21:43 IST

పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామన్న భారత విదేశాంగశాఖ

దిల్లీ: అఫ్గానిస్థాన్‌ నుంచి విదేశీ సైనిక బలగాలు వెనక్కి వెళ్లిన తర్వాత ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా మారినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తాలిబన్లు గతంలో స్థావరాలుగా ఉన్న ప్రాంతాలను మళ్లీ వారి అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోన్న తరుణంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో అప్రమత్తమైన కొన్ని దేశాలు తమ రాయబార కార్యాలయాలను మూసివేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో భారత్‌ కూడా తన కాన్సులేట్‌, రాయబార సిబ్బందిని తిరిగి వెనక్కి రప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టిందనే వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన భారత విదేశాంగశాఖ.. అఫ్గాన్‌లో రాయబార కార్యాలయం, కాన్సులేట్‌లు ప్రస్తుతానికి యథావిధిగా పనిచేస్తాయని ప్రకటించింది. అయినప్పటికీ అక్కడి భద్రతా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది.

అఫ్గాన్‌ నుంచి విదేశీ సైనిక సేనలు వెళ్లిపోయిన తర్వాత అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌ల భద్రతపై ఆయా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా తాలిబన్లు దాడులకు తెగబడతారనే భయంతో అఫ్గాన్‌ ప్రభుత్వ అధికారులే తమ కార్యాలయాలను ఖాళీ చేసి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే దాదాపు వెయ్యి మంది అఫ్గాన్‌ సైనికులు తజకిస్థాన్‌ పారిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులను ఆయా దేశాలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. ఇటు భారత్‌ కూడా అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులపై దృష్టి సారించింది. అఫ్గానిస్థాన్‌లో మూడు నగరాల్లో భారత కాన్సులేట్‌లు ఉండగా.. కాబూల్‌లో రాయబార కార్యాలయం ఉంది.

ఇదిలాఉంటే, ఉగ్రసంస్థ అల్‌ఖైదా, తాలిబన్‌లను సమూలంగా అంతం చేయడమే లక్ష్యంగా అమెరికా, నాటో దళాలు అఫ్గానిస్థాన్‌లో జరిపిన రెండు దశాబ్దాల యుద్ధం ముగిసిన విషయం తెలిసిందే. దీంతో అఫ్గాన్‌లో ఉన్న అమెరికా సైనిక ఆఖరి బెటాలియన్లు అక్కడ నుంచి తమ దేశానికి వెళ్లిపోయినట్లు ప్రకటించాయి. దీంతో అఫ్గానిస్థాన్‌ నుంచి విదేశీ సైనిక బలగాల ఉపసంహరణ దాదాపు పూర్తయింది. ఈ నేపథ్యంలో తాలిబన్లు మరోసారి విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే తాలిబన్‌ బలగాలు బాగ్రం వైమానిక స్థావరంపై దాడి చేస్తాయని అఫ్గాన్‌ మిలటరీ జనరల్‌ కొహిస్తాని అంచనా వేశారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో తాలిబన్ల కదలికలు మొదలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ బలగాలు వెళ్లిపోయినప్పటికీ బాగ్రం వైమానిక ప్రాంతాన్ని కాపాడుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తామని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని