Madras HC: ఆఫీసులో మొబైల్‌ ఫోన్స్‌ వాడొద్దు.. మద్రాసు హైకోర్టు కీలక తీర్పు

తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు మద్రాసు హైకోర్టు గట్టి షాకిచ్చింది. ప్రభుత్వ సిబ్బంది ఆఫీసు పనివేళల్లో వ్యక్తిగత అవసరాల కోసం మొబైల్‌ ఫోన్స్‌ను ఉపయోగించకూడదని స్పష్టం చేసింది

Updated : 15 Mar 2022 19:05 IST

చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు మద్రాసు హైకోర్టు గట్టి షాకిచ్చింది. ప్రభుత్వ సిబ్బంది ఆఫీసు పనివేళల్లో వ్యక్తిగత అవసరాల కోసం మొబైల్‌ ఫోన్స్‌ను ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. ఓ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించి విధివిధానాలను రూపొందించాలని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఎస్‌ఎం సుబ్రమణియమ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. అంతేగాక, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.  

తిరుచిరాపల్లిలోని హెల్త్‌ రీజనల్‌ వర్క్‌షాప్‌ విభాగంలో సూపరిండెంట్‌గా పనిచేస్తోన్న ఓ వ్యక్తి.. ఇటీవల ఆఫీసులో తోటి ఉద్యోగుల వీడియోలు తీశాడు. వద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా తన తీరు మార్చుకోకపోవడంతో ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్‌ చేశారు. దీంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. అతడి పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు.. ప్రభుత్వ సిబ్బంది ఆఫీసుల్లో తరచూ మొబైల్‌ వినియోగిస్తుండటంపై అసహనం వ్యక్తం చేసింది. 

‘‘ఆఫీసుల్లో మొబైల్‌ ఫోన్లు వినియోగిస్తుండటం, ఫోన్లలో వీడియోలు తీయడం ఇటీవల తరచుగా జరుగుతున్నాయి. ఇవన్నీ తోటి ఉద్యోగులకు అసౌకర్యాన్ని కలిగించడమే గాక, ప్రభుత్వ ఆఫీసుల్లో కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నాయి. అందువల్ల ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది, ఉద్యోగులు కనీస క్రమశిక్షణ పాటించాలి. మొబైల్‌ ఫోన్లను వీలైతే స్విఛాఫ్‌ చేయాలి. లేదా వైబ్రేషన్‌/సైలెంట్‌ మోడ్‌లో పెట్టాలి. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌ మాట్లాడాల్సి వస్తే పై అధికారుల అనుమతి తీసుకుని ఆఫీస్‌ నుంచి బయటకు వెళ్లి మాట్లాడి రావాలి’’ అని హైకోర్టు స్పష్టం చేసింది.

దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలు రూపొందించాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సర్క్యులర్‌ జారీ చేయాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని సూచించింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు