credit guarantee: ఈసీఎల్‌జీఎస్‌ వర్తింపు విస్తరణ!

కరోనా సెకండ్‌ వేవ్‌లో వ్యాపారాలు దెబ్బతినడంతో రుణాలను చెల్లించలేని సంస్థలకు ఊరటనిచ్చే విషయాన్ని ప్రభుత్వం చెప్పింది.

Published : 30 May 2021 22:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా సెకండ్‌ వేవ్‌లో వ్యాపారాలు దెబ్బతినడంతో రుణాలను చెల్లించలేని సంస్థలకు ఊరటనిచ్చే విషయాన్ని ప్రభుత్వం చెప్పింది. ది ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారెంటీ స్కీం (ఈసీఎల్‌జీఎస్‌)ను విస్తరించింది. దీనిని ఈసీఎల్‌జీఎస్‌ 4.0గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ పథకం ప్రవేశపెట్టిన దగ్గర నుంచి నాలుగు సార్లు విస్తరించారు. ఈ పథకంలో ఉన్న రూ.500 కోట్ల రుణ పరిమితిని కూడా ఈ సారి తొలగించింది.  వారికి ఉన్న రుణంలో 40శాతం గానీ, లేదా రూ.200 కోట్లు కానీ అదనంగా తీసుకోవచ్చు. ఈసీఎల్‌జీఎస్‌ 1.0లో అర్హులు మరో 10శాతం అదనంగా రుణం తీసుకొనే అవకాశం కల్పించింది. 

తాజాగా చేసిన మార్పుల ప్రకారం ఈ పథకం కింద ఆసుపత్రులు, నర్సింగ్‌ హోమ్‌లలో ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు, ఎంఎస్‌ఎంఈ ఖాతాల రీస్ట్రక్చరింగ్‌కు, పౌర విమానయాన శాఖ వంటి రంగాలకు వర్తింపజేస్తోంది. ఈ స్కీం తుదిగడువును సెప్టెంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 31కు పొడిగించింది.  ఆసుపత్రులు ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు తీసుకొనే రూ.2 కోట్ల వరకు రుణాలకు ఇది వర్తిస్తుంది. వీటిపై వడ్డీ 7.5 శాతానికి మించదు.  

‘‘ఈసీఎల్‌జీఎస్‌లో మార్పులు చేయడంతో ఈ పథకం ప్రయోజనం, ప్రభావం మరింత పెరిగింది. ఎంఎస్‌ఎంఈలు ఆర్థికంగా నిలదొక్కుకొని మరింత మందికి జీవనోపాధి కల్పించేందుకు ఉపయోగపడుతుంది. ఈ మార్పులతో సహేతుకమైన నిబంధనలతో రుణాలు లభిస్తాయి’’ అని ఆర్థికశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని