New CDS: తదుపరి సీడీఎస్‌పై కేంద్రం కసరత్తు.. రిటైర్డ్‌ అధికారులకూ ఛాన్స్‌!

విమాన ప్రమాదంలో జనరల్‌ బిపిన్‌ రావత్‌ మరణించడంతో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) పదవి ఖాళీ అయ్యింది. దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నా ఆ స్థానంలో కొత్తగా ఎవరినీ ప్రభుత్వం నియమించలేదు.

Published : 18 Apr 2022 02:07 IST

దిల్లీ: హెలికాప్టర్‌ ప్రమాదంలో జనరల్‌ బిపిన్‌ రావత్‌ మరణించడంతో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) పదవి ఖాళీ అయ్యింది. దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నా ఆ స్థానంలో కొత్తగా ఎవరినీ ప్రభుత్వం నియమించలేదు. త్వరలోనే దీనిపై కేంద్రం ఓ ప్రకటన చేయనున్నట్లు  తెలుస్తోంది. అయితే, ఈ పోస్టుకు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న, పదవీ విరమణ పొందిన అధికారుల పేర్లనూ పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. అలాగే, తదుపరి ఆర్మీ చీఫ్‌ ఎవరనే దానిపైనా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే భారత తొలి సీడీఎస్‌గా జనరల్‌ బిపిన్‌ రావత్‌ నియమితులైన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 8న జరిగిన కాప్టర్‌ ప్రమాదంలో ఆయన మరణించడంతో ఆ పదవి ఖాళీ అయ్యింది. దీంతో త్రివిధ దళాల అధిపతుల కమిటీ ఛైర్మన్‌ పోస్టును తెరపైకి తెచ్చారు. దీనికి ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం నరవణె ప్రస్తుతం ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన పదవీ కాలం ఏప్రిల్‌ నెలాఖరుతో ముగియనుంది.

నరవణె 2019 డిసెంబరు నుంచి ఆర్మీ చీఫ్‌గా కొనసాగుతున్నారు. ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరి గతేడాది సెప్టెంబర్‌ 30న వాయు సేనాధిపతిగా బాధ్యతలు స్వీకరించగా.. నేవీ చీఫ్‌గా అడ్మిరల్‌ ఆర్‌ హరి కుమార్‌ నవంబర్‌ 30న బాధ్యతలు స్వీకరించారు. ఈ ముగ్గురిలో నరవణెనే సీనియర్‌ కావడంతో సీడీఎస్‌గా ఆయన పేరును ప్రతిపాదించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఆర్మీ చీఫ్‌గా పదవీ విరమణ చేయడానికి ఒక్క రోజు ముందు బిపిన్‌ రావత్‌ను సీడీఎస్‌గా ప్రభుత్వం నియమించడం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని