Enemy Properties: శత్రువుల ఆస్తులతో కేంద్రానికి రూ.3,400కోట్లు

ఎనిమీ ప్రాపర్టీ (Enemy Properties) ద్వారా రూ.3,400కోట్ల నిధులను ఆర్జించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇంతకీ శత్రు ఆస్తులంటే ఏంటీ? ఎవరికి చెందినవి..?

Updated : 21 Feb 2023 12:39 IST

దిల్లీ: దేశంలోని శత్రువుల ఆస్తుల (enemy properties)ను విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.3,400 కోట్లు ఆర్జించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (Home Ministry) మంగళవారం వెల్లడించింది. ఇందులో అధిక భాగం షేర్లు, బంగారం, రెవెన్యూ రిసీట్ల వంటి చరాస్తుల రూపంలోనే ఉన్నట్లు పేర్కొంది.

‘‘శత్రువుల ఆస్తుల (enemy properties) ద్వారా ఆర్జించిన రూ.3,407.98 కోట్లను కస్టోడియన్‌ ఆఫ్‌ ఎనిమీ ప్రాపర్టీ ఆఫ్‌ ఇండియా (సెపీ CEPI) విడుదల చేసింది. ఇందులో 152 కంపెనీలకు చెందిన 7.53కోట్ల షేర్లు (Shares) ఉన్నాయి. వీటి విలువ రూ.2,708.9 కోట్లు. ఇక, మరో రూ.699.08 కోట్లు రెవెన్యూ రిసీట్ల రూపంలో ఉన్నాయి’’ అని హోంశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. వీటితో పాటు గవర్నమెంట్‌ ఆఫ్ ఇండియా మింట్‌ ద్వారా 2021 జనవరిలో 1699.79గ్రాముల బంగారాన్ని (Gold) విక్రయించి రూ.49.14లక్షలు, 28.89కిలోల వెండి ఆభరణాలను విక్రయించి రూ.10.92లక్షలకు ఆర్జించినట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు శత్రువులకు చెందిన ఎలాంటి స్థిరాస్తులను ప్రభుత్వం సొమ్ము చేసుకోలేదని తెలిపారు.

ఎనిమీ ప్రాపర్టీ అంటే..

భారత్‌- పాక్‌ విభజన, 1962, 1965 యుద్ధాల తర్వాత భారతీయులు ఎవరైనా పాకిస్థాన్‌, చైనా వెళ్లేందుకు కేంద్రం అవకాశమిచ్చింది. అయితే ఆ దేశాల పౌరసత్వం తీసుకున్నవారి స్థిరచరాస్తులు కేంద్రానికి చెందుతాయని అప్పట్లో నోటిఫికేషన్‌ ఇచ్చింది. అలా వారు వదిలివెళ్లిన ఆస్తులనే ఎనిమీ ప్రాపర్టీ (enemy properties) అంటారు. ఆ ఆస్తులు, భూముల నిర్వహణ బాధ్యతను సెపికి అప్పగించింది.

అలా, మన దేశంలో 12,611 శత్రు ఆస్తులున్నాయి. ఇందులో 12,386 ఆస్తులు పాక్‌ పౌరసత్వం తీసుకున్నవారివి కాగా.. మిగతా 126 చైనా జాతీయులవి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 6,255 ఎనిమీ ప్రాపర్టీలను గుర్తించగా.. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌లో 4,088, దిల్లీలో 659, గోవాలో 295, మహారాష్ట్రలో 208, తెలంగాణలో 158, గుజరాత్‌లో 151, త్రిపురలో 105, బిహార్‌లో 84, మధ్యప్రదేశ్‌లో 94, ఛత్తీస్‌గఢ్‌లో 78, హరియాణాలో 71 శత్రు ఆస్తులున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని