Ukraine Crisis: భారతీయుల తరలింపు.. కేంద్రం కీలక ప్రకటన

రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతోన్న సైనికపోరులో ఎంతోమంది సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వేలసంఖ్యలో భారతీయ విద్యార్థులు, పౌరులు ఈ భయానక పరిస్థితుల మధ్య బిక్కుబిక్కుమంటున్నారు.

Published : 26 Feb 2022 01:48 IST

దిల్లీ: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతోన్న సైనికపోరులో ఎంతోమంది సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వేలసంఖ్యలో భారతీయ విద్యార్థులు, పౌరులు ఈ భయానక పరిస్థితుల మధ్య బిక్కుబిక్కుమంటున్నారు. వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత్ తన ప్రయత్నాలను వేగవంతం చేసింది. వారిని ఉక్రెయిన్‌ నుంచి రొమేనియా, హంగరీ మీదుగా తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు హంగరీలోని భారత రాయబార కార్యాలయం ప్రకటన చేసింది. దీనిలో భాగంగా శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో రెండు ఎయిరిండియా విమానాలు భారత్‌ నుంచి బయలుదేరనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. వారిని తీసుకువచ్చేందుకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందని ఆ వర్గాలు వెల్లడించాయి.

‘భారతీయుల్ని తరలించేందుకు రొమేనియా, హంగరీ నుంచి తగిన మార్గాలను ఏర్పాటు చేస్తున్నాం. దీనిపై  భారత ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయం పనిచేస్తున్నాయి. ప్రస్తుతం తరలింపు బృందాలు హంగరీ సరిహద్దు అయిన చోప్‌-జహోనీ, రొమేనియన్ సరిహద్దు అయిన పొరుబ్నే-సిరెత్ వద్ద ఉన్నాయి. ఈ సరిహద్దు ప్రాంతాలకు దగ్గరగా ఉన్న భారత పౌరులు.. విదేశాంగశాఖతో సమన్వయం చేసుకొని ముందుగా బయలుదేరాలి’ అని హంగరీలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. 

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడే.. భారత పౌరుల్ని తరలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విమానాలను ప్రకటించింది. కానీ ఈలోపే రష్యా అనూహ్యంగా సైనికచర్య ప్రకటించడంతో.. ఉక్రెయిన్ గగనతలం మూసివేసింది. దాంతో దిల్లీ నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానం వెనక్కి మళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ప్రభుత్వం ప్రస్తుతం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టింది. పోరు తీవ్రం కావడంతో తమను తరలించాలని పలువురు విద్యార్థులు అభ్యర్థనలు చేస్తోన్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని