PFI: పీఎఫ్‌ఐపై కేంద్రం నిషేధం.. ఉత్తర్వులు జారీ చేసిన హోంశాఖ

పీఎఫ్‌ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా)పై కేంద్రం నిషేధం విధించింది...

Updated : 28 Sep 2022 09:57 IST

దిల్లీ: పీఎఫ్‌ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా)పై కేంద్రం నిషేధం విధించింది. పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థలపై ఐదేళ్లపాటు నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. యూఏపీఏ చట్టం కింద ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. 

ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులను అందించడంతోపాటు యువతకు శిక్షణ ఇస్తున్నారనే ఆరోపణలపై పీఎఫ్‌ఐ కార్యాలయాలపై దేశవ్యాప్తంగా భారీ ఆపరేషన్‌ను కేంద్ర హోంశాఖ చేపట్టిన విషయం తెలిసిందే. ఎన్‌ఐఏ ఆధ్వర్యంలో పలుచోట్ల దాడులు కూడా నిర్వహించారు. వందలాది మంది పీఎఫ్‌ఐ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు.


ఏమిటీ పీఎఫ్‌ఐ?

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ).. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా మారుమోగిన పేరిది. కారణం- జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తొలిసారి ఏకకాలంలో 15 రాష్ట్రాల్లో ఈ సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడమే! ఇంతకూ ఏమిటీ పీఎఫ్‌ఐ? ఎవరు వీరంతా? దీని లక్ష్యమేంటి? చరిత్రేంటి?

సిమి పోయి పీఎఫ్‌ఐ వచ్చే..

దక్షిణభారతంలోని మూడు ముస్లిం సంస్థలు కలసి 2007లో పీఎఫ్‌ఐగా ఆవిర్భవించాయి. ఈ సంస్థ ఏర్పాటుకు ఓ నేపథ్యం ఉంది. వివాదాస్పద స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూమెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమి) సంస్థపై ప్రభుత్వం నిషేధం విధించాక... కేరళలోని నేషనల్‌ డెమొక్రాటిక్‌ ఫ్రంట్‌, కర్ణాటకలోని ఫోరం ఫర్‌ డిగ్నిటీ, తమిళనాడులోని మనితా నీతి పసరాయ్‌ సంస్థలు కలసిపోయి పీఎఫ్‌ఐని స్థాపించటం గమనార్హం!

ఏంటి లక్ష్యం?

మైనార్టీలు, దళితులు, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడటం తమ లక్ష్యంగా పీఎఫ్‌ఐ ప్రకటించుకుంది. కానీ... ఇది నిషేధిత సిమికి మారు రూపమే అంటూ 2012లో అప్పటి కేరళ ముఖ్యమంత్రి ఊమెన్‌చాందీ సారథ్యంలోని కాంగ్రెస్‌ సర్కారు హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ‘పీఎఫ్‌ఐకి రహస్య ఎజెండా ఉంది. మత మార్పిడులు, సమస్యలకు మతరంగు పులమటం, తమకు మతపరంగా, రాజకీయంగా వ్యతిరేకులైనవారిని అంతమొందించటానికి వీలుగా ముస్లిం యువతను రెచ్చగొట్టి నియమించుకోవటం, ఉగ్రవాద సంస్థల్లో చేరేలా శిక్షణ ఇవ్వటం... ఇవీ పీఎఫ్‌ఐ చేసే పనులు’ అని కేరళ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కర్ణాటకలో పీఎఫ్‌ఐపై 300కు పైగా కేసులు నమోదయ్యాయి.

రాజకీయాలకు ఎస్‌డీపీఐ

తమ సంస్థలోని సభ్యుల పేర్ల జాబితాను పీఎఫ్‌ఐ నిర్వహించదు. అంతేగాకుండా నేరుగా ఎన్నికల్లోనూ పాల్గొనదు. కానీ 2009లో తమ సంస్థకు అనుబంధంగా సోషల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌డీపీఐ) రాజకీయ పార్టీని ఏర్పాటు చేసింది. తమ లక్ష్యానికి అనుగుణంగా రాజకీయంగా ఎస్‌డీపీఐ ముందుంటే... వెనకాల నుంచి పీఎఫ్‌ఐ పనిచేస్తుంది. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో పీఎఫ్‌ఐ/ఎస్‌డీపీఐ ప్రధానంగా దృష్టిసారించాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా కర్ణాటక ప్రాంతాల్లో (ఉడుపి తదితర) స్థానిక ఎన్నికలతో శ్రీకారం చుట్టాయి. 2013లో 21 స్థానిక సంస్థల సీట్లను గెల్చిన ఎస్‌డీపీఐ 2018 నాటికి ఆ సంఖ్యను 121కి పెంచుకుంది. 2021లో ఉడుపి జిల్లాలోని మూడు స్థానిక కౌన్సిళ్లను కైవసం చేసుకుంది. 2013 నుంచి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల బరిలోకీ దిగింది. ముస్లిం ఓట్లను ఆకర్షించే క్రమంలో రాజకీయ పార్టీలు పీఎఫ్‌ఐ/ ఎస్‌డీపీఐలతో అంటకాగుతుంటాయి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts