రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా వారు ఉండకూడదు..!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారి లేదా ఆయా ప్రభుత్వంతో సంబంధమున్న వ్యక్తి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేయకూడదని, ఆ స్థానంలో స్వతంత్ర వ్యక్తి ఉండాలని సుప్రీం కోర్టు  అభిప్రాయపడింది.

Published : 12 Mar 2021 14:25 IST

సుప్రీం కోర్టు అభిప్రాయం

దిల్లీ: ప్రభుత్వ అధికారులను ఎన్నికల కమిషనర్లుగా నియమించడంపై భారత అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారి లేదా ఆయా ప్రభుత్వంతో సంబంధమున్న వ్యక్తి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేయకూడదని.. ఆ స్థానంలో స్వతంత్ర వ్యక్తి ఉండాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.

‘ప్రభుత్వాలకు సంబంధం లేని స్వతంత్ర వ్యక్తులు ఎన్నికల కమిషనర్లుగా ఉండాలి. ప్రభుత్వంలో ఎలాంటి బాధ్యతలు చేపడుతోన్న వ్యక్తిని కూడా ఆ స్థానంలో నియమించకూడదు’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. పంచాయతీ ఎన్నికలపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ గోవా ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణలో భాగంగా జస్టిస్‌ ఆర్‌ ఎఫ్‌ నారీమన్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం స్వత్రంత్ర వ్యక్తిని ఆ స్థానంలో నియమించాలని సూచించింది. రాష్ట్ర న్యాయ కార్యదర్శిగా ఉన్న వ్యక్తికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ)గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గోవా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై స్టే విధిస్తూ బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇది సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసు విచారణను చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. ఎన్నికల కమిషన్‌ వ్యవహారాల్లో రాష్ట్రం జోక్యం చేసుకోకూడదని రాజ్యంగం సూచిస్తోందన్న విషయాన్ని సుప్రీం మరోసారి గుర్తుచేసింది.

ఇక రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి 10 రోజుల్లోనే నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, ఏప్రిల్‌ 30 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలని గోవా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని