CoWIN: దేశంలో టీకా కార్యక్రమాలన్నీ ‘కొవిన్‌’ గొడుగు కిందికి..!

దేశవ్యాప్తంగా కరోనా టీకా వివరాల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం స్వదేశీ సాంకేతికతతో ప్రత్యేకంగా ‘కొవిన్‌’ వేదికను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీని ద్వారా కొవిడ్‌ టీకా నమోదుతోపాటు సర్టిఫికెట్‌లనూ జారీ చేస్తోంది. ఈ విషయంలో ‘కొవిన్‌’ సమర్థంగా పని చేస్తోన్నందున...

Published : 27 May 2022 23:16 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా టీకా వివరాల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం స్వదేశీ సాంకేతికతతో ప్రత్యేకంగా ‘కొవిన్‌’ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీని ద్వారా కొవిడ్‌ టీకా నమోదుతోపాటు సర్టిఫికెట్‌లనూ జారీ చేస్తోంది. ఈ విషయంలో ‘కొవిన్‌’ సమర్థంగా పని చేస్తోన్నందున.. ఈ పోర్టల్‌ను మరిన్ని సేవలకు ఉపయోగించుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. జాతీయ స్థాయిలోని ఇతర వ్యాక్సిన్‌ కార్యక్రమాలకూ దీన్ని వినియోగించేందుకు వీలుగా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. తద్వారా అన్ని రకాల టీకా వ్యవస్థలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సులువుగా ఉంటుందని యోచిస్తోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా చేపడుతున్న యూనివర్సల్‌ ఇమ్యూనైజేషన్‌ ప్రోగ్రామ్‌(యూఐపీ)తోపాటు కుటుంబ నియంత్రణ వంటి జాతీయ ఆరోగ్య కార్యక్రమాల రికార్డులను భౌతికంగానే నిర్వహిస్తున్నారు. అయితే, ఒక్కసారి కొవిన్‌ను మరింత అభివృద్ధి చేశాక.. మొత్తం టీకా వ్యవస్థ డిజిటలైజేషన్‌ అవుతుందని కొవిన్‌ చీఫ్‌, జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ సీఈవో డా.ఆర్‌ఎస్‌ శర్మ ఓ వార్తా సంస్థకు తెలిపారు. ‘దీంతో లబ్ధిదారులను ట్రాక్‌ చేయడం సులభతరం అవుతుంది. రికార్డులను సమర్థంగా నిర్వహించవచ్చు. రియల్‌ టైం పర్యవేక్షణ సాధ్యపడుతుంది. అక్కడికక్కడే టీకా సర్టిఫికెట్‌లు పొందొచ్చు. డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ ధ్రువపత్రాలు డిజీ-లాకర్లలోనూ నిల్వ ఉంటాయి’ అని వివరించారు.

‘యూఐపీ’ అనేది ఆయా వ్యాధుల నుంచి పిల్లలు, గర్భిణులను రక్షించేందుకు భారత్‌లో నిర్వహించే టీకా కార్యక్రమం. ప్రపంచంలో అతిపెద్ద టీకా ప్రాజెక్ట్‌లలో ఇదీ ఒకటి. దీని కింద పోలియో, ధనుర్వాతం, తట్టు, హెపటైటిస్- బీ వంటి 12 వ్యాధులకు ప్రభుత్వం ఉచితంగా టీకాలు అందిస్తోంది. ఈ క్రమంలోనే సమీకృత టీకా సమాచార వ్యవస్థ ప్రాధాన్యాన్ని నొక్కి చెబుతూ.. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో టీకా కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించడంలో ఇది దోహదపడుతుందని ఓ అధికారి తెలిపారు. ప్రజారోగ్య విధానాలను రూపొందించేవారికి సరైన డేటా అందుబాటులో ఉంటుందని చెప్పారు. కొవిన్‌ ద్వారా ఎప్పటిలాగే కొవిడ్ టీకా రికార్డుల నిర్వహణ సైతం కొనసాగుతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని