Cabinet Decisions: 14 రకాల పంటలకు మద్దతు ధర పెంపు.. కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే..

ఖరీఫ్‌ సీజన్‌ పంటలకు మద్దతు ధర పెంచడంతో పాటు కేంద్ర క్యాబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

Updated : 19 Jun 2024 21:37 IST

దిల్లీ: కేంద్ర క్యాబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వరి, జొన్న, పత్తి సహా 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ఆమోదం తెలిపింది. క్యాబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర రైల్వే, సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వెల్లడించారు. వరి పంటకు కనీస మద్దతు ధరను రూ.117 అదనంగా పెంచడంతో.. క్వింటాల్‌ ధాన్యం ధర రూ.2300కు చేరింది.

తాజా పెంపుతో పలు పంటల మద్దతు ధరలు (క్వింటాల్‌) ఇలా..

వరి (సాధారణ రకం) రూ.2,300; వరి (గ్రేడ్‌-ఎ)- రూ.2,320; జొన్న (హైబ్రిడ్‌) రూ.3,371, జొన్న (మాల్దండి) 3,421; సజ్జలు రూ.2,625, రాగులు 4,290, మొక్కజొన్న రూ.2,225,  వేరుశెనగ 6,783, పొద్దుతిరుగుడు విత్తనాలు రూ.7280, నువ్వులు రూ.9,267, సోయాబీన్‌ (పసుపు) 4,892, పెసలు రూ.8,682, పత్తి (మధ్యరకం) రూ.7,121, పత్తి (లాంగ్ స్టెపెల్‌) రూ.7,521, కంది రూ.7,550, మినుము రూ.7,400కి చేరాయి.

అలాగే, మహారాష్ట్రలోని విధావన్‌ వద్ద గ్రీన్‌ఫీల్డ్‌ డీప్‌ డ్రాఫ్ట్‌ పోర్టును రూ.76,200 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇది పూర్తయితే ప్రపంచంలోనే టాప్‌- 10 పోర్టుల్లో ఒకటిగా నిలవనుంది. ఈ పోర్టు నిర్మాణం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు పది లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నట్లు అంచనా.

గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో మొత్తం రూ.7,453 కోట్లతో చెరో 500 మెగావాట్ల సామర్థ్యంతో ఆఫ్‌షోర్‌ పవన విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే, వారణాసిలో అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రూ.2,869.65 కోట్లతో కొత్త టెర్మినల్‌ భవనం నిర్మాణంతో పాటు రన్‌వేల విస్తరణ ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు