SJM: సంపన్నులకు పన్ను రాయితీ కాదు.. వారి పాస్‌పోర్టులు రద్దు చేయాలి : ఎస్‌జేఎం

అధిక ఆదాయం కలిగిన వ్యక్తులకు పన్ను రాయితీ కల్పించడం పట్ల ఆరెస్సెస్‌ అనుబంధ విభాగం స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

Published : 02 Feb 2023 17:23 IST

దిల్లీ: దేశంలో అధిక సంపాదన కలిగిన వ్యక్తులకు (HNIs) తాజా బడ్జెట్‌లో (Budget 2023) పన్ను రాయితీలు కల్పించడం పట్ల ఆరెస్సెస్‌ అనుబంధ విభాగం ‘స్వదేశీ జాగరణ్‌ మంచ్‌’ (SJM) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సంపన్నులపై భారీ పన్నులు విధించడంతో పాటు విదేశాలకు వలస పోకుండా నిరోధించేందుకు వారి పాస్‌పోర్టులను రద్దు చేయాలని సూచించింది. 

‘వివిధ కారణాలు చెప్పి ఎంతోమంది దేశాన్ని విడిచిపోతున్నారు. ఇక్కడ పన్నులు అధికంగా ఉన్నందున ఇతర దేశాల్లో పనిచేసేందుకు వెళ్తున్నామని చెబుతున్నారు. ఇటువంటి వారికి కొత్త పన్ను విధానంలో రాయితీని కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. ఒకవేళ నేనే ఆర్థిక మంత్రినైతే.. ఇటువంటి సంపన్నులను దేశం విడిచి వెళ్లకుండా ఆపడంతో పాటు వారి పాస్‌పోర్టులను రద్దుచేయాలని ప్రధానమంత్రిని కోరేవాడిని’ అని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్‌జేఎం (Swadeshi Jagran Manch) కో-కన్వీనర్‌ అశ్వాణి మహజన్‌ అభిప్రాయపడ్డారు. భారత్‌ను ప్రగతిపథంలో తీసుకెళ్లాలని.. ఈ క్రమంలో ఇటువంటి వారిని ఇందులో భాగస్వామ్యం చేయకూడదన్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2023-24లో సంపన్నులకు పన్ను రాయితీని ప్రతిపాదించారు. దేశాన్ని విడిచి వెళ్లకుండా నిరోధించడంలో భాగంగా అధిక నికర-సంపద కలిగిన వ్యక్తులపై (HNWI)పై ప్రస్తుతమున్న అన్ని రకాల సర్‌ఛార్జిలు కలిపి 42.74శాతం ఆదాయపు పన్నును (రూ.5కోట్లకు పైగా ఆదాయం ఉన్నవారికి) వసూలు చేస్తున్నారు. దీంతో వారిపై సర్‌ఛార్జిని 37శాతం నుంచి 25శాతానికి కుదిస్తున్నట్లు చెప్పారు. దీంతో సంపన్నులు చెల్లించాల్సిన పన్ను 39శాతానికి తగ్గనున్నట్లు చెప్పారు. దీనిపై స్పందించిన ఎస్‌జేఎం.. అలా వెళ్లకుండా ఉండాలంటే వారి పాస్‌పోర్టులను రద్దు చేయడమే ఉత్తమమని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని