IPC, CrPCలో సవరణల దిశగా అడుగులు.. సలహాలు కోరిన కేంద్రం

దేశంలో క్రిమినల్‌ చట్టాల్లో సమగ్ర మార్పులు తీసుకొచ్చే లక్ష్యంగా కేంద్రం ముందడుగు వేసింది. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (IPC), క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (CrPC), ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌లో సవరణలు తీసుకొచ్చే ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది.

Published : 23 Mar 2022 18:47 IST

దిల్లీ: దేశంలో క్రిమినల్‌ చట్టాల్లో సమగ్ర మార్పులు తీసుకొచ్చే లక్ష్యంగా కేంద్రం ముందడుగు వేసింది. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (IPC), క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (CrPC), ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌లో సవరణలు తీసుకొచ్చే ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. ఇందుకోసం భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులను కేంద్రం ప్రారంభించిందని హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ కుమార్‌ రాజ్యసభలో బుధవారం వెల్లడించారు. గవర్నర్లు, ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంత అధికారులు, సీజేఐ, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, రాష్ట్రాల బార్‌ కౌన్సిళ్లు, వివిధ యూనివర్సిటీలు, లా ఇన్‌స్టిట్యూట్‌, ఎంపీల నుంచి సలహాలు కోరినట్లు ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమమిచ్చారు.

దేశంలో క్రిమినల్‌ జస్టిస్‌ వ్యవస్థను సమగ్రంగా సమీక్షించాల్సిన అవసరం ఉందంటూ హోంశాఖ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమర్పించిన 146వ నివేదిక పేర్కొందని కేంద్రమంత్రి తెలిపారు. స్టాండింగ్‌ కమిటీ సమర్పించిన 111వ, 128వ నివేదిక సైతం క్రిమిల్‌ చట్టాల్లో మార్పులు అవసరం అని అభిప్రాయపడ్డాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్‌ పీనల్‌ కోడ్‌, 1860; క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌, 1973; ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌, 1872లో సవరణల కోసం మార్పులు చేయడానికి ప్రభుత్వం సంప్రదింపులు ప్రారంభించిందని కేంద్రమంత్రి తెలిపారు. దీనిపై దిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ నేతృత్వంలో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కమిటీ సిఫార్సులు, భాగస్వామ్య పక్షాల నుంచి వచ్చిన సూచనల మేరకు క్రిమినల్‌ చట్టాల్లో సవరణలు చేయనున్నట్లు రాజ్యసభలో వెల్లడించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని