సైరస్ మిస్త్రీ ప్రమాద ఘటన.. ఇక వంతెనలకు క్రాష్‌ బారియర్లు..!

వంతెనలపై వాహనాలకు భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఉన్న బ్రిడ్జీలపై రెయిలింగ్‌ల స్థానంలో క్రాష్‌ బారియర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను సూచించినట్లు తెలుస్తోంది.

Updated : 15 Dec 2022 12:35 IST

(ప్రతీకాత్మక చిత్రం)

ఇంటర్నెట్‌ డెస్క్‌: మూడు నెలల క్రితం ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్‌ మిస్త్రీ (Cyrus Mistry) కారు ప్రమాదంలో అకాల మరణం చెందడం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కారు అతివేగం, సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో పాటు ప్రమాదం జరిగిన వంతెన (Bridges) వద్ద క్రాష్‌ బారియర్లు (Crash Barriers) లేకపోవడం కూడా ఈ దుర్ఘటనకు ఓ కారణమని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే వంతెనల వద్ద వాహనాల భద్రతా ప్రమాణాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్రిడ్జీలపై రెయిలింగ్స్‌ (Railing) తొలగించి వాటి స్థానంలో క్రాష్‌ బారియర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.

వంతనలపై రెయిలింగ్స్‌ను తొలగించి క్రాష్‌ బారియర్లను ఏర్పాటు చేసే అవసరంపై కేంద్ర రోడ్లు, రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల.. అన్ని రాష్ట్రాలు, జాతీయ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI) అధికారులకు ఓ సర్క్యులర్‌ జారీ చేసినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ‘‘వంతెనలపై రాకపోకలు సాగించే వాహనాలకు భద్రత కల్పించేందుకు క్రాష్‌ బారియర్లను ఏర్పాటు చేయడం అత్యవసరం. అయితే, ప్రస్తుతం ఉన్న వంతెనలను వెడల్పు చేయకుండా వాటి రెయిలింగ్స్‌ను మార్చడం నిర్మాణపరంగా సమర్థంగా ఉంటుందా? లేదా? అన్నదే సమస్య. ఈ విషయాన్ని మంత్రిత్వశాఖ పరిశీలిస్తోంది. అయితే, రెయిలింగ్స్‌ స్థానంలో క్రాష్‌ బారియర్లను ఏర్పాటు చేసేముందు కొన్ని కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. క్రాష్‌ బారియర్ల నిలువు పటిష్టత, డిజైన్ లోడ్‌, కాంక్రీట్‌ నాణ్యతను తనిఖీ చేయాలి’’ అని ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

ఇక ఫుట్‌పాత్‌ ఉన్నా లేకపోయినా కొత్తగా నిర్మించే వంతెలకు క్రాష్‌ బారియర్లను ఏర్పాటు చేయాలని ఆ సర్క్యులర్‌లో సూచించారు. ‘రెండు లేన్లతో ఉన్న వంతెనలన్నీ వెడల్పు చేసినా చేయకపోయినా లోపలి వైపు క్రాష్‌ బారియర్లు.. బయటివైపు పాదచారుల రెయిలింగ్స్‌ను తప్పనిసరిగా ఏర్పాటుచేయాలి. ఇక నాలుగు లేన్లతో ఉన్న వంతెనలకైతే.. రెయిలింగ్స్‌ను తొలగించి వాటి స్థానంలో క్రాష్‌ బారియర్లను అమర్చాలి’’ అని కేంద్ర మంత్రిత్వశాఖ స్పష్టం చేసినట్లు ఆ సర్క్యులర్‌లో ఉంది.

ఈ ఏడాది సెప్టెంబరులో టాటా సన్స్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ కన్నుమూసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలయ్యారు. అహ్మదాబాద్‌ నుంచి ముంబయి వెళ్తుండగా.. మహారాష్ట్రలోని పాల్ఘార్‌ జిల్లాలో సూర్యనది వంతెనపై ఆయన ప్రయాణిస్తున్న కారు రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మిస్త్రీతో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారులో మిస్త్రీ వెనుకవైపు కూర్చున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలిసింది. ప్రమాద సమయంలో మిస్త్రీ సీటు బెల్టు కూడా పెట్టుకోలేదట. ఇక, ఆ వంతెన గోడ వద్ద క్రాష్‌ బారియర్లు ఉంటే.. ప్రమాద తీవ్రత తగ్గేదేమో అనే అభిప్రాయాలూ వినిపించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని