Kashmir: వరుస హత్యల ఎఫెక్ట్‌.. 177 మంది కశ్మీరీ పండిట్‌ టీచర్ల బదిలీ

జమ్మూకశ్మీర్‌లో గత కొన్ని రోజులుగా అల్పసంఖ్యాక వర్గాల వారిపై ఉగ్రదాడులు జరుగుతుండటంతో కశ్మీరీ పండితుల్లో భయాందోళన మొదలైంది. దీంతో అక్కడ ఉద్యోగాలు చేస్తోన్న కశ్మీరీ పండితులు తమను

Published : 04 Jun 2022 13:53 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో గత కొన్ని రోజులుగా అల్పసంఖ్యాక వర్గాల వారిపై ఉగ్రదాడులు జరుగుతుండటంతో కశ్మీరీ పండితుల్లో భయాందోళన మొదలైంది. దీంతో అక్కడ ఉద్యోగాలు చేస్తున్న కశ్మీరీ పండితులు తమను ట్రాన్స్‌ఫర్‌ చేయాలని డిమాండ్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీనగర్‌లో విధులు నిర్వహిస్తున్న 177 మంది పండిట్‌ టీచర్లను బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కశ్మీర్‌లో వరుస హత్యల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. నిన్న ఆర్మీ చీఫ్‌ మనోజ్ సిన్హా, జమ్మూకశ్మీర్‌ ఉన్నతాధికారులలో భేటీ అయ్యారు. ఈ సమావేశం జరిగిన మరుసటి రోజే టీచర్ల బదిలీపై ఉత్తర్వులు రావడం గమనార్హం.

1990ల్లో కశ్మీర్‌ లోయలో అల్ప సంఖ్యాక వర్గాలపై జరిగిన ఊచకోతతో ఆ ప్రాంతం నుంచి వేలాది కశ్మీరీ పండితుల కుటుంబాలు వలస వెళ్లాయి. అయితే వీరిని తిరిగి స్వస్థలాలకు రప్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ప్రధానమంత్రి  ప్రత్యేక పునరావాస ప్యాకేజీ కింద వేలాది మందికి ఎస్సీ కోటాలో ఉద్యోగాలిచ్చి కశ్మీర్‌ లోయలో నియమించింది. వీరికి ఆర్థిక ప్యాకేజీలు కూడా ప్రకటించింది. దీంతో చాలా మంది తిరిగి కశ్మీర్‌ లోయకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు.

అయితే, గత కొన్ని నెలలుగా వీరిని లక్ష్యంగా చేసుకుని మళ్లీ దాడులు జరుగుతున్నాయి. కేవలం వారం వ్యవధిలోనే ఉగ్రవాదులు ఎనిమిది మందిని టార్గెట్‌ చేసి చంపడం భయాందోళన కలిగిస్తోంది. మృతుల్లో పోలీసులతో పాటు టీచర్లు, బ్యాంకు ఉద్యోగి, వలస కూలీ ఉన్నారు. దీంతో కశ్మీర్‌ లోయలో విధులు నిర్వహిస్తున్న వేలాది మంది పండితులు, అల్పసంఖ్యా వర్గాల ఉద్యోగులు నిరసనలకు దిగారు. తమను మరో ప్రాంతానికి బదిలీ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని