Agnipath: సాయుధ బలగాల్లో కొత్త సర్వీస్‌.. ‘అగ్నిపథ్‌’ ఆవిష్కరణ

యువత, సాంకేతికతకు అధిక ప్రాధాన్యం కల్పించేలా త్రివిధ దళాలు, సాయుధ బలగాల నియామక ప్రక్రియలో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ‘అగ్నిపథ్‌’ పేరుతో షార్ట్‌ సర్వీసు పథకాన్ని ప్రారంభించింది.

Updated : 14 Jun 2022 16:03 IST

దిల్లీ: యువత, సాంకేతికతకు అధిక ప్రాధాన్యం కల్పించేలా త్రివిధ దళాలు, సాయుధ బలగాల నియామక ప్రక్రియలో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ‘అగ్నిపథ్‌’ పేరుతో కొత్త సర్వీసు పథకాన్ని ప్రారంభించింది. నాలుగేళ్ల కాలపరిమితితో ఉండే ఈ సర్వీసుకు సంబంధించిన నియామక ప్రణాళికను కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. త్రివిధ దళాల అధిపతులతో కలిసి మంగళవారం ఆవిష్కరించారు.

90 రోజుల్లో తొలి ర్యాలీ..

ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘కేంద్రం నేడు చారిత్రక నిర్ణయం తీసుకుంది. అగ్నిపథ్‌ పథకంతో సాయుధ బలగాల్లో చేరేందుకు యువతకు అవకాశం లభిస్తుంది. అంతేగాక, దీని ద్వారా పలు రంగాల్లో కొత్త నైపుణ్యాలతో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి’’ అని చెప్పుకొచ్చారు. అగ్నిపథ్ నియామకాల కోసం టూర్‌ ఆఫ్‌ డ్యూటీ పేరుతో ప్రత్యేక ర్యాలీలు చేపట్టేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. వచ్చే మూడు నెలల్లో తొలి ర్యాలీ నిర్వహించనున్నట్లు రక్షణశాఖ వెల్లడించింది.

ఈ ఏడాది తొలి బ్యాచ్‌ కింద 45వేల మంది యువతను నియమించుకోనున్నారు. అగ్నిపథ్‌ సర్వీసులో చేరేందుకు 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య యువత దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఆరు నెలలు శిక్షణ ఇచ్చి.. మూడున్నరేళ్లు సర్వీసులో కొనసాగిస్తారు. ఆర్మీ సర్వీసు పూర్తయ్యాక మెరుగైన ప్యాకేజీతో పాటు తుది దశ ఎంపికలో ప్రతిభ చూపిన 25 శాతం మందికి శాశ్వత కమిషన్‌లో పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. అగ్నిపథ్‌లో చేరిన యువతకు సైనికులతో సమానంగా ర్యాంకులు, వేతనాలు, గౌరవాన్నీ ఇస్తారు. నాలుగేళ్ల సర్వీసు అనంతరం అగ్నివీర్‌ స్కిల్‌ సర్టిఫికెట్‌ మంజూరుతో పాటు పదవీ విరమణ తరువాత ఉపాధి అవకాశాలు పొందేలా నిబంధనల్లో మార్పులు చేయనున్నారు.

అగ్నివీరులకు సదుపాయాలు ఇలా..

వైద్యపరీక్షల్లో ఉత్తీర్ణత, ఇతర అర్హతలు ఉన్నవారికే అగ్నిపథ్‌లో ప్రవేశం లభిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు కేంద్ర డేటాబేస్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఎంపికలు ఆటోమేటెడ్‌ పద్ధతిలో జరుగుతాయి. ఎంపికైన వారందరికీ రెగ్యులర్‌ కేడర్‌లో ప్రవేశానికి అర్హత లభిస్తుంది. ప్రతిబ్యాచ్‌లో 25శాతం మందికే ఈ అవకాశం దక్కుతుంది. అగ్నివీరులుగా ఎంపికైన వారికి ఏదైనా రెజిమెంట్‌, యూనిట్‌, సంస్థలో పోస్టింగ్‌తో పాటు సైనిక బలగాల తరహాలో ర్యాంకు ఇస్తారు. సర్వీసు కాలంలో రూ.30వేల నుంచి రూ.40వేల వరకు వేతనం, ఇతర సదుపాయాలు అందిస్తారు. సర్వీసులో మెరుగైన ప్రతిభ చూపినవారికి సేవాపతకాలు లభిస్తాయి. పనిచేసిన కాలానికి వేతనం నుంచి 30 శాతాన్ని సేవానిధి ప్యాకేజీ కింద తీసుకుంటారు. దీనికి సమానంగా కేంద్రం తనవంతు జమచేస్తుంది. నాలుగేళ్ల సర్వీసు అనంతరం ఏకమొత్తంగా రూ. 11.71 లక్షల నిధి(పన్ను మినహాయింపుతో) అందిస్తుంది. బ్యాంకు నుంచి రూ.16.5 లక్షల రుణసదుపాయం కల్పిస్తుంది. దీంతో పాటు సర్వీసులో రూ.48లక్షల వరకు బీమా రక్షణ కూడా ఉంటుంది.

వేతనాలు, పింఛను భారాన్ని తగ్గించుకునేందుకు..

త్రివిధ దళాల్లో వేతనాలు, పింఛన్ల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా ఈ అగ్నిపథ్‌ సర్వీసును కేంద్రం తీసుకొచ్చింది. రక్షణ రంగానికి కేటాయించే వార్షిక బడ్జెట్‌లో దాదాపు సగానికి పైగా వీటికే ఖర్చవుతుంది. అయితే అగ్నిపథ్‌లో చేరి నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత.. వారికి ఎలాంటి పింఛను సదుపాయం ఉండదు కాబట్టి.. రక్షణ శాఖకు కొంత మేర ఆర్థిక భారం తగ్గనుంది. మిగులు నిధులతో త్రివిధ దళాల ఆధునికీకరణకు వెసులుబాటు లభించనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని