CustomsDuty Waiver: తగ్గనున్న కొవిడ్‌ కిట్ల ధరలు!

కొవిడ్‌ బాధితుల చికిత్సలో ఉపయోగించే కొన్ని రకాల ఔషధాల తయారీకి కావాల్సిన ముడిపదార్థాలు (API), కొవిడ్‌ కిట్‌ ముడిపదార్థాల దిగుమతిపై కస్టమ్స్‌ సుంకాన్ని మినహాయిస్తున్నట్లు వెల్లడించింది.

Published : 13 Jul 2021 18:45 IST

ముడిపదార్థాల దిగుమతిపై కస్టమ్స్‌ సుంకం మినహాయించిన కేంద్రం

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న వేళ.. కొవిడ్‌ కిట్లతో పాటు కీలక ఔషధాల ధరలను తాత్కాలికంగా తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొవిడ్‌ బాధితుల చికిత్సలో ఉపయోగించే కొన్ని రకాల ఔషధాల తయారీకి కావాల్సిన ముడిపదార్థాల (API) దిగుమతిపై కస్టమ్స్‌ సుంకాన్ని మినహాయిస్తున్నట్లు వెల్లడించింది. వీటితోపాటు కొవిడ్‌ టెస్టు కిట్‌ల ముడిపదార్థాల దిగుమతిపై ఇది వర్తిస్తుందని పేర్కొంది. దీంతో బ్లాక్‌ఫంగస్‌ చికిత్సలో వాడే ఔషధంతోపాటు కొవిడ్‌ కిట్ల ధరలు మరికొన్ని రోజులపాటు తగ్గే అవకాశం ఉంది.

కరోనా సెకండ్‌ వేవ్ ఉద్ధృతి సమయంలో బ్లాక్‌ఫంగస్‌తో పాటు ఇతర కీలక ఔషధాల కొరత ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఔషధ తయారీకి కావాల్సిన ముడి పదార్థాల దిగుమతిపై కస్టమ్స్‌ సుంకాన్ని తాత్కాలికంగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం DMPC, DMPG, HSPC, DSPG, ఎగ్‌లిసైథిన్‌, కొలెస్ట్రాల్‌ హెచ్‌పీతో పాటు కొవిడ్‌ కిట్ల తయారీలో వినియోగించే అమ్మోనియం థయోసైనేట్‌ వంటి ముడిపదార్థాల దిగుమతిపై కస్టమ్స్‌ సుంకాన్ని మినహాయించింది. ఏపీఐలపై ఆగస్టు 31వరకు, టెస్టు కిట్‌ ముడిపదార్థాలపై సెప్టెంబర్‌ 31 వరకూ ఈ మినహాయింపులు వర్తిస్తాయని ఆర్థికశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కొవిడ్‌ కిట్లు, ఔషధాలు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది.

ఇక కొవిడ్‌కు సంబంధించిన శానిటైజర్లు, పల్స్‌ ఆక్సీమీటర్లు, టెస్టింగ్‌ కిట్‌, శరీర ఉష్ణోగ్రత కొలిచే సాధనాలతో పాటు అంబులెన్సుల వంటి 18రకాల వస్తువుల రేట్లపై పన్నులను తగ్గిస్తున్నట్లు ఆర్థికశాఖకు చెందిన రెవెన్యూ విభాగం గత నెలలోనే ప్రకటించింది. యాంఫోటెరిసిన్‌పై ఉన్న 5శాతం జీఎస్టీని పూర్తిగా తొలగించగా.. రెమ్‌డెసివిర్‌, హెపారిన్‌ వంటి ఔషధాలపై ఉన్న 12శాతం జీఎస్టీని 5శాతానికి తగ్గించింది. ఇక అంబులెన్సులపై 28శాతం జీఎస్టీ ఉండగా.. వాటిని 12శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గించిన ధరలు ఈ ఏడాది సెప్టెంబర్‌ 31వరకు అమలులో ఉంటాయని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని