Data Protection Bill: డేటా ప్రొటెక్షన్‌ బిల్లుపై కేంద్రం వెనక్కి..!

వ్యక్తిగత డేటా ప్రొటెక్షన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ బిల్లుకు జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ 81 సవరణలు ప్రతిపాదించడంతో పాటు చట్టపరమైన సమగ్ర విధానం దిశగా 12 కొత్త సిఫార్సులు చేసింది

Published : 03 Aug 2022 17:54 IST

దిల్లీ: వ్యక్తిగత డేటా ప్రొటెక్షన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ బిల్లుకు జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ 81 సవరణలు ప్రతిపాదించడంతో పాటు చట్టపరమైన సమగ్ర విధానం దిశగా 12 కొత్త సిఫార్సులు చేసింది. దీంతో ప్రస్తుతానికి ఈ బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ బుధవారం లోక్‌సభకు వెల్లడించారు. త్వరలోనే కొత్త బిల్లు తీసుకొస్తామని తెలిపారు.

దేశంలో వ్యక్తిగత వివరాలకు భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2019లో ఈ ‘పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లును ప్రతిపాదించింది. అయితే దీనిపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని విపక్షాలు ఆరోపించాయి. దీంతో ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి పంపింది. ఈ కమిటీ దీనిపై అధ్యయనం చేసి.. నివేదికను రూపొందించింది. గతేడాది డిసెంబరులో ఈ నివేదికను పార్లమెంట్‌ ఉభయసభలకు సమర్పించింది.

వ్యక్తిగత డేటాతో పాటు వ్యక్తిగతేతర డేటానూ ఈ ముసాయిదా చట్ట పరిధిలోకి తీసుకురావాలని, తదనుగుణంగా దీన్ని విస్తృత పరచాలని కమిటీ సూచించింది. సామాజిక మాధ్యమాలను ప్రచురణకర్తలుగా పరిగణించి, వాటిని మరింత జవాబుదారీ చేయాలని పేర్కొంది. ‘డేటా ప్రొటెక్షన్‌ అథారిటీ’ని ఏర్పాటు చేయడంతో పాటు... అన్ని స్థానిక, విదేశీ సంస్థలు నిబంధనలను సక్రమంగా పాటించేలా పర్యవేక్షించాలని సూచించింది.

ఇలా ఈ బిల్లుకు కమిటీ 81 సవరణలు ప్రతిపాదించింది. దీంతో కేంద్రం ఈ బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. త్వరలోనే సమగ్ర చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా కొత్త బిల్లును తీసుకురానున్నట్లు వెల్లడించింది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని