PM Modi: అదే మా నినాదం.. అభివృద్ధి మంత్రం: మోదీ

వెనుకబడిన వారికే ప్రాధాన్యత అనే నినాదంతోనే భాజపా ప్రభుత్వం ముందుకెళ్తోందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. రాజస్థాన్‌లోని దేవ్‌నారాయణ్‌ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.

Published : 28 Jan 2023 20:16 IST

జైపూర్‌: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి భాజపా ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘వెనుకబడిన వారికే ప్రాధాన్యత’ అనే నినాదంతోనే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. రాజస్థాన్‌లోని గుర్జార్‌ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు దేవుడిగా ఆరాధించే దేవనారాయణుడి 1111వ జయంతి ఉత్సవాలకు మోదీ హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బిల్వాడా జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. యావత్‌ ప్రపంచం ఇప్పుడు భారత్‌వైపు చూస్తోందన్న ఆయన.. అన్ని రంగాల్లోనూ భారత్‌ తన సత్తాను చాటుతోందని చెప్పారు.

ఇతర దేశాలపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకుంటూ.. స్వశక్తితో భారత్‌ ఎదుగుతోందని మోదీ తెలిపారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంతోపాటు ఇతర ఉద్యమాల్లో గుర్జార్‌ సామాజిక వర్గానికి చెందిన ప్రజల తెగువను ప్రశంసించారు. అయితే, అలాంటి ధీరత్వం కలిగిన వ్యక్తులకు చరిత్రలో తగిన స్థానం దక్కకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వాలు చేసిన పొరపాట్లను ప్రస్తుతం దిద్దుకుంటూ వెళ్తున్నామన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగినా.. అవేవీ ఫలించలేదన్న మోదీ.. భారత్ కేవలం భూభాగం మాత్రమే కాదు.. ఓ నాగరికత, సంస్కృతి అని అన్నారు. గత ఎనిమిది తొమ్మిదేళ్లుగా సమాజంలోని ప్రతి వర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించిందని చెప్పారు.  రైతులకు మేలు జరిగేలా పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా రూ.15,000 కోట్లు రాజస్థాన్‌కు మంజూరు చేసినట్లు మోదీ వెల్లడించారు.

సెలవు ప్రకటించిన రాజస్థాన్‌ ప్రభుత్వం

సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న దేవ్‌నారాయణ్‌ జయంతి ఉత్సవాలకు మోదీ హాజరైనప్పటికీ.. ఆయన పర్యటనపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. మరో 10 నెలల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రధాని పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్ర జనాభాలో 9 నుంచి 12 శాతం మంది ప్రజలు గుర్జార్‌ సామాజిక వర్గానికి చెందిన వారే ఉంటారు. తూర్పు రాజస్థాన్‌ ప్రాంతంలోని దాదాపు 40 నుంచి 50 అసెంబ్లీ స్థానాల్లో వీళ్ల ఓట్లు చాలా కీలకం. ఈ నేపథ్యంలో రాజకీయ ఎత్తుగడతోనే ప్రధాని రాష్ట్ర పర్యటకు వచ్చారని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది. అయితే, ప్రధాని రాకను పురస్కరించుకొని ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రంలో.. ప్రధాని రాక సందర్భంగా సెలవు ప్రకటించడం చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని