Published : 27 Dec 2021 01:13 IST

vaccination for children: పిల్లలకు టీకాకు ముందు ఆ దేశాల డేటాను విశ్లేషించాలి..

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిల్లలకు కోవిడ్‌ టీకాపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అశాస్త్రీయమని, పిల్లలకు టీకా వేయడం వలన ఎటువంటి అదనపు ప్రయోజనం ఉండదని  ఎయిమ్స్‌ సీనియర్‌ ఎపిడమాలజిస్ట్ డా.సంజయ్‌ కె రాయ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఎయిమ్స్‌లో పెద్దలు, పిల్లలకు కోవాక్సిన్‌ ట్రయల్స్‌ పరిశోధకునిగా, ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ అసోసియేషన్‌ అధ్యక్షునిగానూ వ్యవహరిస్తున్నారు.పిల్లలకు టీకాపై ప్రభుత్వ నిర్ణయంపై ఆయన నేడు తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాయ్‌ మాట్లాడుతూ.. పిల్లలకు కోవిడ్‌ టీకా వేయడం అమలు చేయడానికి ముందు, ఇప్పటికే పిల్లలకు టీకా వేయడం ప్రారంభించిన దేశాల డేటాను విశ్లేషించాలని సూచించారు. శనివారం రాత్రి జాతినుద్ధేశించి ప్రధాని మాట్లాడుతూ 15-18ఏళ్ల లోపు పిల్లలకు కోవిడ్‌-19 టీకా ప్రక్రియను జనవరి 3నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. టీకా వేయడం ద్వారా పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే పిల్లలు, వారి తల్లిదండ్రుల ఆందోళనను తగ్గిస్తుందని, మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. టీకా వేయడం ద్వారా పాఠశాలల్లో బోధన సాధారణ స్థితికి వచ్చేందుకు దోహదమవుతుందని అన్నారు.

నిర్ణయానికి స్పష్టమైన లక్ష్యం ఉండాలి

ప్రధాని మోదీ దేశానికి చేస్తున్న నిస్వార్థసేవ, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటున్నందుకు తాను కూడా ప్రధానికి వీరాభిమానినని డా.రాయ్‌ తెలిపారు. కానీ పిల్లలకు టీకా వేయడంపై ప్రభుత్వం తీసుకున్న అశాస్ర్తీయ నిర్ణయం పట్ల నిరాశ చెందినట్లు ప్రధాని కార్యాలయాన్ని ట్యాగ్‌ చేస్తూ రాయ్‌ ట్వీట్‌ చేశారు. కోవిడ్‌ మహమ్మారి సంక్రమణను, తీవ్రతను, మరణాలను నివారించడం లక్ష్యమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన  ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి స్పష్టమైన లక్ష్యం ఉండాలన్నారు.టీకాల విషయంలో మనకున్న పరిజ్ఞానం ప్రకారం టీకా ఇన్‌ఫెక్షన్‌ను గణనీయంగా తగ్గించడం లేదన్నారు. కొన్ని దేశాల్లో బూస్టర్‌ డోస్‌లు తీసుకున్న తర్వాత కూడా ప్రజలు వ్యాధిబారిన పడుతున్న విషయాలను ప్రస్తావించారు. అదే విధంగా యూకేలో రోజుకు 50వేల బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్లు నమోదవుతున్న విషయాన్ని ఎత్తి చూపారు. వీటి ఆధారంగా టీకా కోవిడ్‌ను నిరోధించడం లేదని, అయితే టీకా వ్యాధి తీవ్రతను, మరణాలను నివారించడంలో ప్రభావవంతంగా  పనిచేస్తున్న విషయం వాస్తవమని తెలిపారు.

విదేశాల డేటాను విశ్లేషించాలి

కోవిడ్‌-19 బారిన పడే జనాభాలో మరణాలు దాదాపు 1.5శాతంగా ఉన్నాయని అంటే ప్రతి మిలియన్‌ జనాభాలో 15,000మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. టీకా వేసుకోవడం ద్వారా మరణాలను 80-90శాతం నివారించవచ్చని ఈలెక్కన మిలియన్‌కు 13వేల నుంచి 14వేల మరణాలు నిరోధించవచ్చన్నారు. పిల్లల విషయంలో  కరోనా వ్యాప్తి తక్కువగా ఉందని, అందుబాటులో ఉన్న ప్రభుత్వ డేటా ప్రకారం ప్రతి మిలియన్‌ జనాభాకు ఇద్దరు మాత్రమే మృతి చెందినట్లు తెలుస్తోందన్నారు.కావున మధ్యవయస్కుల్లో రిస్క్‌, బెనిఫిట్‌ విశ్లేషణ చేస్తే భారీ ప్రయోజనాలు చేకూరుతాయని వెల్లడించారు. 15వేల మంది పెద్దలు మరణించారే తప్పితే పిల్లలు కాదని ఈ ప్రతికూల ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని రిస్క్‌, బెనిఫిట్‌ను విశ్లేషణ చేస్తే ప్రయోజనం కన్నా ప్రమాదమే ఎక్కువగా ఉంటుందని రాయ్‌ వివరించారు. ఈ కారణాల దృష్ట్యా పిల్లలకు టీకా వేయడం ద్వారా ఎటువంటి లక్ష్యాలు నెరవేరవన్నారు. యూఎస్‌ సహా కొన్ని దేశాలు నాలుగైదు నెలల క్రితం పిల్లలకు టీకా వేయడం ప్రారంభించాయని పిల్లల్లో టీకా ప్రారంభానికి ముందు ఈ దేశాల డేటాను విశ్లేషించాలని రాయ్‌ సూచించారు.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని