టీకా ముడిపదార్థాలు: మీరు జోక్యం చేసుకోండి!

ముడిపదార్థాల దిగుమతిపై అమెరికా విధించిన తాత్కాలిక నిషేధంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ప్రముఖ వ్యాక్సిన్‌ తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ కేంద్రానికి లేఖ రాసింది.

Published : 09 Mar 2021 02:04 IST

కేంద్రానికి లేఖ రాసిన సీరం ఇన్‌స్టిట్యూట్‌

దిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే, టీకా తయారీకి కావాల్సిన ముడిపదార్థాల కొరతతో వ్యాక్సిన్‌ తయారీకి ఆటంకం ఏర్పడుతోందని ఫార్మా సంస్థలు అందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ముడిపదార్థాల దిగుమతిపై అమెరికా విధించిన తాత్కాలిక నిషేధంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ప్రముఖ వ్యాక్సిన్‌ తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ కేంద్రానికి లేఖ రాసింది.

భారత్‌లో భారీ స్థాయిలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తి అవుతున్నప్పటికీ కొన్ని రకాల ముడి పదార్థాల కోసం అమెరికాపైనే వ్యాక్సిన్‌ సంస్థలు ఆధారపడుతున్నాయి. అమెరికాలోనూ వ్యాక్సిన్‌ తయారీ భారీ ఎత్తున చేపడుతున్న నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ యాక్ట్‌ను అమల్లోకి తెచ్చింది. దీంతో వ్యాక్సిన్‌ తయారీకి కావాల్సిన ముడిపదార్థాల ఎగుమతిని నియంత్రించింది. దీంతో ఇతర దేశాలకు వ్యాక్సిన్‌ ముడి పదార్థాల కొరత ఏర్పడినట్లు భారత్‌లోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ పేర్కొంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసినట్లు వెల్లడించింది.

‘భారత్‌లో కొవిషీల్డ్‌తో పాటు అమెరికాకు చెందిన నోవావాక్స్‌, కొడాజెనిక్స్‌ వంటి వ్యాక్సిన్‌లను తయారుచేసేందుకు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. వీటి తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు అమెరికా నుంచే దిగుమతి చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ యాక్ట్‌ను తేవడం వల్ల దిగుమతికి అటంకం ఏర్పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఎగుమతికి ఒప్పందాలు చేసుకున్న నేపథ్యంలో భారీ ఎత్తున వీటిని తయారీ చేయాల్సి ఉంది. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ముడిపదార్థాల అంశంపై జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలి’ అని కేంద్రానికి రాసిన లేఖలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు