సాగు చట్టాలపై..ఆ ప్రతిపాదన ఉత్తమమైంది!

వ్యవసాయ చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తామని కేంద్రం సూచించిన ప్రతిపాదన ఉత్తమమైందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ పేర్కొన్నారు.

Published : 25 Jan 2021 22:40 IST

కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్‌

దిల్లీ: వ్యవసాయ చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తామని కేంద్రం సూచించిన ప్రతిపాదన ఉత్తమమైందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ పేర్కొన్నారు. దీనిపై రైతు సంఘాలు చర్చించి నిర్ణయం తెలియజేస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. రైతు సంఘాలు తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ చేపట్టిన నేపథ్యంలో కేంద్ర మంత్రి మరోసారి రైతు సంఘాలకు సూచించారు.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు కేంద్రం రైతు సంఘాలతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. ఇప్పటికే పదకొండు దఫాల్లో చర్చలు జరిపినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. అయితే, పదోసారి జరిగిన భేటీలో భాగంగా, ఒకటి నుంచి ఒకటిన్నర ఏళ్లపాటు ఈ చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేసేందుకు సిద్ధమని కేంద్రం ప్రతిపాదించింది. వీటిపై తుది నిర్ణయం తీసుకోవాలని తాజాగా జరిగిన 11వ సమావేశంలో సూచించింది. అయితే, దీనిపై రైతు సంఘాల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే విషయంపై స్పష్టత లేదు.

ఈ సమయంలోనే గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని సరిహద్దుల్లో భారీ స్థాయిలో ట్రాక్టర్‌ పరేడ్‌ నిర్వహించేందుకు రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. ఇందుకోసం వేల సంఖ్యలో ట్రాక్టర్లతో రైతులు దిల్లీకి చేరుకుంటున్నారు. ఈ ర్యాలీ తర్వాత ప్రభుత్వం సూచించిన ప్రతిపాదనపై రైతు సంఘాలు ఎలాంటి ప్రకటన చేస్తాయనే విషయం ఆసక్తిగా మారింది. ఇక వీరికి మద్దతుగా మహారాష్ట్ర రైతులు కూడా భారీ ర్యాలీ చేపట్టారు. 

ఇదిలాఉంటే, ఓవైపు ప్రభుత్వంతో చర్చలు జరుపుతోన్న సమయంలోనే సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ రైతు సంఘాలతో సంప్రదింపులు జరుపుతోంది. తొలి దశలో భాగంగా ఎనిమిది రాష్ట్రాల్లోని రైతు సంఘాలతో సమావేశమై వారి అభిప్రాయాలు, సూచనలను తీసుకుంది. రెండో దఫా చర్చలను ఈ నెల 27న కొనసాగించనుంది.

ఇవీ చదవండి..
50వేల ట్రాక్టర్లతో రైతన్నల ర్యాలీ!
దండు కదులుతోంది..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని