NEET UG 2024: గ్రేస్‌ మార్కులు రద్దు

నీట్‌-యూజీ (2024) పరీక్షపై భారీస్థాయిలో వివాదం చెలరేగుతున్న వేళ.. గ్రేస్‌ మార్కులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Published : 14 Jun 2024 03:15 IST

ఆ 1563 మందికి తిరిగి పరీక్ష నిర్వహిస్తాం
‘నీట్‌ యూజీ’పై సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

దిల్లీ: నీట్‌-యూజీ (2024) పరీక్షపై భారీస్థాయిలో వివాదం చెలరేగుతున్న వేళ.. గ్రేస్‌ మార్కులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమయం నష్టపోవడం, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో గందరగోళం, పరిపాలనాపరమైన ఇతర కారణాలతో 1563 మంది విద్యార్థులకు కేటాయించిన గ్రేస్‌ మార్కులను రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ అభ్యర్థుల వాస్తవ మార్కులు (గ్రేస్‌ మార్కులు కాకుండా) వెల్లడిస్తామని, వారికి తిరిగి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది. ఒకవేళ వారు పరీక్ష రాయడానికి ఇష్టపడకపోతే, మే 5న జరిగిన నీట్‌ పరీక్షలో వారికి వచ్చిన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పింది. ఈ నిర్ణయాన్ని ఎన్టీఏ నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తీసుకున్నామని జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాల ధర్మాసనానికి కేంద్రం తరఫున న్యాయవాది కను అగర్వాల్‌ తెలిపారు. మే 5న జరిగిన నీట్‌ పరీక్షలో 1563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్‌ మార్కులు ఇచ్చారు. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడం, ఇతర పరిపాలనా కారణాలతో వీటిని కలిపారు. ఈ మార్కుల కేటాయింపుపై ‘ఫిజిక్స్‌ వాలా’ విద్యాసంస్థ సీఈవో అలఖ్‌ పాండే సహా ఇతరులు వేసిన పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా 1563 మంది విద్యార్థుల కోసం ఈ నెల 23న మళ్లీ ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని, ఫలితాలను ఈ నెల 30లోపు విడుదల చేస్తామని కేంద్రం తెలిపింది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ యథావిధిగా జులై ఆరున ప్రారంభమవుతుందని పేర్కొంది. కేంద్రం వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్న సుప్రీంకోర్టు గ్రేస్‌ మార్కుల విషయంలో దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. నీట్‌ ప్రశ్నపత్రం లీక్, ఇతర అక్రమాల విషయంలో దాఖలైన పిటిషన్లపై జులై 8న విచారించనుంది. గ్రేస్‌ మార్కులపై అభ్యంతరం తెలుపుతూ ‘ఫిజిక్స్‌ వాలా’ విద్యాసంస్థ పిటిషన్‌ వేయగా.. ప్రశ్నపత్రం లీకేజీ, ఇతర అక్రమాలపై అబ్దుల్లా మహమ్మద్‌ ఫయాజ్, షేక్‌ రోషన్‌ మొహిద్దీన్‌ వేశారు. గ్రేస్‌ మార్కుల కేటాయింపు పద్దతిని సవాల్‌ చేస్తూ మరో పిటిషన్‌ను నీట్‌ అభ్యర్థి కార్తీక్‌ దాఖలు చేశారు.

తగ్గిన టాప్‌ ర్యాంకర్ల సంఖ్య

గ్రేస్‌ మార్కుల రద్దు నిర్ణయంతో నీట్‌-యూజీ (2024) టాప్‌ ర్యాంకర్ల సంఖ్య 67 నుంచి 61కి పడిపోయింది. గ్రేస్‌ మార్కులు కేటాయించిన 1563 మంది అభ్యర్థుల్లో ఆరుగురికి టాప్‌ ర్యాంకులు వచ్చాయి. ఈ ఆరుగురు ఎన్టీఏ జరపనున్న ప్రవేశ పరీక్ష రాసి 720కి 720 మార్కులు సాధిస్తే తిరిగి అగ్రస్థానంలో నిలుస్తారు. పరీక్ష రాయకపోతే టాప్‌ ర్యాంకును కోల్పోతారు. 

పేపర్‌ లీక్‌కు ఆధారాలు లేవు: కేంద్రం

నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌కు ఆధారాలు లేవని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పష్టం చేశారు. విపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తూ.. విద్యార్థుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయని పేర్కొన్నారు. నీట్‌పై మరోసారి కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ధ్వజమెత్తాయి. పరీక్షలో చోటు చేసుకున్న అక్రమాలపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.ఈ అంశాన్ని పార్లమెంటులోనూ లేవనెత్తుతామని పేర్కొంది. పదేళ్లుగా పేపర్‌ లీక్‌లు, అక్రమాల ద్వారా దేశ యువత భవిష్యత్తును మోదీ ప్రభుత్వం నాశనం చేస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు. ఈ నెల 14న విడుదల చేయాల్సిన నీట్‌ ఫలితాలను ఈ నెల నాలుగున ప్రకటించడం వెనక కుట్ర ఉందని మరో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. లోక్‌సభ ఫలితాల ప్రకటన సమయంలో ప్రకటిస్తే.. నీట్‌లో జరిగిన అక్రమాలను ఎవరూ పట్టించుకోరనే ఉద్దేశంతోనే ఫలితాలను ముందుగా విడుదల చేశారని విమర్శించారు. గ్రేస్‌ మార్కుల రద్దుతో కేంద్రం తన అసమర్థతను మరోసారి బయటపెట్టుకుందని తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్‌ పేర్కొన్నారు. ఎంబీబీఎస్‌ ప్రవేశాల్లో రాష్ట్రాల హక్కులను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని