
బాలీవుడ్ ప్రముఖులతో అయోధ్యలో రామ్లీలా నాటకం
9 రోజులపాటు ప్రదర్శన
లఖ్నవూ: బాలీవుడ్ ప్రముఖులు దసరాకి అయోధ్యలో సందడి చేయనున్నారు. చారిత్రక నగరంలో విశిష్ట రామ్లీలా నాటకాన్ని ప్రదర్శించబోతున్నారు. దిల్లీకి చెందిన ముగ్గురు సభ్యులతో కూడిన ఓ ప్రొడక్షన్ బృందం ఇప్పటికే అయోధ్యకు చేరుకొని నిర్వహణ పనులు చేపట్టింది. అక్టోబర్ 17 నుంచి 25 వరకు 9 రోజులపాటు ప్రదర్శించనున్న ఈ నాటకాన్ని సరయు నదీ తీరంలోని లక్ష్మణ్ ఖిలాలో నిర్వహించనున్నారు.
నాటకంలో రాముడి పాత్రను సోను సాగర్ పోషించనుండగా, సీత పాత్రలో కవితా జోషి నటించనున్నారు. రామ్నంద్సాగర్ రామాయణంలో హనుమంతుడి వేషం కట్టిన రెజ్లర్, నటుడు ధారాసింగ్ కుమారుడు బిందుదాస్ సింగ్ ఈ నాటకంలో హనుమంతుడి వేషం వేయనున్నారు. నటుడు, భాజపా ఎంపీ మనోజ్ తివారీ అంగదుడి పాత్ర పోషించనున్నారు. రాముడి సోదరుడు భరతుడి పాత్రను భోజ్పురి నటుడు, గోరఖ్పుర్ ఎంపీ రవికిషన్ పోషించనున్నారు. బాలీవుడ్ లెజెండరీ హాస్య నటుడు అస్రానీ నారదుడి వేషం వేయనున్నారు. నటులు రాజా మురాద్, షాబాజ్ఖాన్, అవ్తార్ గిల్, రాజేష్ పూరీ, రాకేష్ బేడీ ఇతర పాత్రలు పోషించనున్నారు.
నాటకం ప్రదర్శన నాటికి కరోనా వైరస్ తగ్గుముఖం పడితే ప్రేక్షకులను వీక్షించేందుకు అనుమతించనున్నారు. మహమ్మారి ఇలాగే కొనసాగితే ప్రేక్షకులను అనుమతించరు. నాటకాన్ని సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. జాతీయ ప్రసార మాధ్యమం దూరదర్శన్లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.