BIMSTEC: ఉక్రెయిన్‌ సంక్షోభం.. బిమ్‌స్టెక్‌ సదస్సులో ప్రధాని కీలక వ్యాఖ్యలు

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య జరుగుతోన్న యుద్ధం అంతర్జాతీయ చట్టాల నిలకడను ప్రశ్నిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ సహకారానికి ప్రాధాన్యత సంతరించుకుందని అభిప్రాయపడ్డారు. శ్రీలంక అధ్యక్షత జరిగిన బిమ్‌స్టెక్‌ సదస్సులో బుధవారం ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. 

Updated : 30 Mar 2022 12:32 IST

దిల్లీ: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య జరుగుతోన్న యుద్ధం అంతర్జాతీయ చట్టాల నిలకడను ప్రశ్నిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ సహకారానికి ప్రాధాన్యత సంతరించుకుందని అభిప్రాయపడ్డారు. శ్రీలంక అధ్యక్షతన జరిగిన బిమ్‌స్టెక్‌ సదస్సులో బుధవారం ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు.

‘ప్రస్తుతం ఐరోపాలో చోటుచేసుకుంటున్న పరిణామాలు అంతర్జాతీయ చట్టాల నిలకడపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ సమయంలో ప్రాంతీయ సహకారానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ కూటమి సామర్థ్యాన్ని బలోపేతం చేయడం ముఖ్యం. మన ప్రాంతం ఆరోగ్య, ఆర్థిక పరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. వాటిని తట్టుకొని నిలిచేందుకు ఐక్యత, సహకారం అవసరం’ అని మోదీ వెల్లడించారు. అలాగే ఈ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం కోసం అంగీకారానికి రావాల్సిన ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. ‘బంగాళాఖాతం ప్రాంతం.. అనుసంధానత, శ్రేయస్సు, భద్రతకు వారధిగా మారే సమయం ఆసన్నమైంది’ అని ప్రధాని అన్నారు.

నెలరోజులకు పైగా రష్యా జరుపుతోన్న దురాక్రమణతో ఉక్రెయిన్ సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఆ ఐరోపా ప్రాంతంలో ప్రాణ నష్టం సంభవిస్తోంది. సుమారు కోటిమంది ఉక్రెయిన్‌ నుంచి వలసవెళ్లినట్లు అంతర్జాతీయ సంస్థలు వెల్లడించాయి. ఈ యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలపై పడింది. ఈ సమయంలో బిమ్‌స్టెక్‌ సదస్సులో ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

బిమ్‌స్టెక్‌ .. బంగ్లాదేశ్‌, భూటాన్‌, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాల కూటమి. ప్రపంచ జనాభాలో 21.7 శాతం ప్రజలు ఇక్కడే ఉన్నారు. ఈ దేశాల మొత్తం జీడీపీ 3.8 ట్రిలియన్ డాలర్ల పైమాటే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని