Green fungus: కొత్తగా గ్రీన్‌ ఫంగస్‌

మధ్యప్రదేశ్‌లో కరోనా నుంచి కోలుకున్న ఓ వ్యక్తికి గ్రీన్‌ ఫంగస్‌ సోకినట్లు వైద్యులు గుర్తించారు. దేశంలో ఇదే మొదటి గ్రీన్‌ ఫంగస్‌ కేసని సీనియర్‌ వైద్యుడొకరు వెల్లడించారు.

Published : 16 Jun 2021 19:02 IST

చికిత్స కోసం ముంబయికి తరలింపు

దిల్లీ: మధ్యప్రదేశ్‌లో కరోనా నుంచి కోలుకున్న ఓ వ్యక్తికి గ్రీన్‌ ఫంగస్‌ సోకినట్లు వైద్యులు గుర్తించారు. దేశంలో ఇదే మొదటి గ్రీన్‌ ఫంగస్‌ కేసని సీనియర్‌ వైద్యుడొకరు వెల్లడించారు. ఈ కొత్త రకం ఫంగస్‌ ఆస్పెర్‌గిలోసిస్‌ ఇన్ఫెక్షన్‌ అని శ్రీ అరబిందో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌కు (ఎస్‌ఏఐఎంఎస్‌) చెందిన డాక్టర్‌ రవి దోసి తెలిపారు. దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరమని ఆయన వెల్లడించారు. ఆస్పర్‌గిలోసిస్‌ ఇన్ఫెక్షన్‌ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన తెలిపారు.

తాజాగా గ్రీన్‌ ఫంగస్‌ సోకిన 34 ఏళ్ల వ్యక్తి రెండు నెలల కిందట కరోనా నుంచి కోలుకున్నారు. 15 రోజుల నుంచి ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం, జ్వరం రావడంతో బ్లాక్‌ ఫంగస్‌ సోకిందేమోనన్న అనుమానంతో ఆయన వైద్యులను సంప్రదించారు. వివిధ పరీక్షల తర్వాత ఆయనకు గ్రీన్‌ ఫంగస్‌ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయన ఊపిరితిత్తులు, రక్తం, సైనస్‌లపై తీవ్ర ప్రభావం పడిందని వారు తెలిపారు. బ్లాక్‌ ఫంగస్‌కు గ్రీన్‌ ఫంగస్‌కు వేర్వేరు ఔషధాలు ఉంటాయని డాక్టర్‌ రవి దోసి తెలిపారు. కాగా బాధితుణ్ని చికిత్స కోసం ఎయిర్‌ అంబులెన్సు ద్వారా ముంబయికి తరలించారు.

కరోనా అనంతరం మానవ శరీరంపై దాడి చేస్తున్న వివిధ రకాల ఫంగస్‌లను రంగులతో సంబోధించడం మానేయాలని ఎయిమ్స్ డైరక్టర్‌ రణదీప్‌ గులేరియా గతంలో సూచించారు. వీటి వల్ల ప్రజలు అయోమయానికి గురవుతారని ఆయన అన్నారు. కాగా దేశంలో మొదట బ్లాక్‌ ఫంగస్‌ను గుర్తించగా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. అనంతరం వైట్‌ ఫంగస్‌, ఎల్లో ఫంగస్‌ కేసులను గుర్తించారు. కాగా వాటి సంఖ్య చాలా తక్కువగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని