Updated : 26 Dec 2021 13:40 IST

Modi: వరుణ్‌ లేఖ నన్ను కలచివేసింది: మోదీ

మన్‌ కీ బాత్‌లో ప్రధాని ఆవేదన

దిల్లీ: తమిళనాడులో ఇటీవల వాయుసేన హెలికాప్టర్‌ కూలి గాయాలై.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌సింగ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ మన్‌ కీ బాత్‌లో గుర్తుచేసుకొని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆగస్టులో శౌర్యచక్ర పురస్కారం అందుకున్న వరుణ్‌.. చిన్ననాటి స్కూల్‌ ప్రిన్సిపల్‌కు రాసిన లేఖ చదివిన తర్వాత తన హృదయం బరువెక్కిందని అన్నారు. ఆ స్థాయికి చేరుకున్న తర్వాత కూడా ఆయన మూలాల్ని మరిచిపోలేదని కొనియాడారు. పైగా ఉత్సాహంగా వేడుక చేసుకోవాల్సిన సమయంలో ముందు తరాల గురించి చింతించారని తెలిపారు.

డిసెంబరు 8న త్రిదళపతి జనరల్‌ బిపిన్‌రావత్‌ సహా 14 మంది సైనిక బృందం ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ తమిళనాడులోని కున్నూర్‌లో కుప్పకూలింది. ఘటనాస్థలిలోనే 13 మంది  మృతి చెందగా.. తీవ్రగాయాలైన గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌సింగ్‌ను తమిళనాడులోని వెల్లింగ్టన్‌ ఆసుపత్రిలో చేర్చారు. మెరుగైన చికిత్స కోసం ఆ తర్వాత బెంగళూరులోని ఐఏఎఫ్‌ కమాండో ఆసుపత్రికి తరలించారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. 

వరుణ్‌ లేఖలో రాసింది ఇదే..

‘సగటు విద్యార్థిగా ఉన్నా పర్వాలేదు. పాఠశాలలో బాగా చదవడం, ప్రతి పరీక్షలో 90కి పైగా మార్కులు సాధించడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఒకవేళ అలా చేస్తే అద్భుత ఘనత కిందే లెక్క. వారిని అభినందించాల్సిందే. అయితే- మార్కులు బాగా రానంతమాత్రాన మీరు ఎప్పుడూ సగటు మనిషిలా ఉండిపోతారేమోనని నిరుత్సాహపడకండి. పాఠశాలలో మీరు సగటు విద్యార్థి కావొచ్చు. భవిష్యత్తులో జరగబోయేదానికి మాత్రం అది కొలమానం కాదు. మీకు ఏది ఇష్టమో గుర్తించండి. ఏ రంగంలోకి దిగినా అంకితభావంతో పనిచేయండి. నేను సగటు విద్యార్థిని. 12వ తరగతిలో అతికష్టం మీద ఫస్ట్‌ డివిజన్‌ సాధించాను. క్రీడల్లోనూ అంతంతమాత్రమే. కానీ నాకు విమానాలన్నా.. విమానయాన రంగమన్నా అమితాసక్తి. అందులో చూపిన తెగువ కారణంగా రాష్ట్రపతి చేతుల మీదుగా శౌర్యచక్ర అవార్డు దక్కింది’ అని ఈ ఏడాది సెప్టెంబరు 18న రాసిన లేఖలో వరుణ్‌ పేర్కొన్నారు.

మన్‌ కీ బాత్‌ ప్రసంగంలోని ఇతర కీలకాంశాలు..

* ప్రపంచదేశాలతో పోలిస్తే కరోనా వ్యాక్సినేషన్‌ విషయంలో భారత్‌ అద్భుతమైన పురోగతి సాధించిందని ప్రధాని అన్నారు. 140 కోట్ల డోసుల మైలురాయిని దాటడం ప్రతి భారతీయుడి విజయంగా ఆయన అభివర్ణించారు.

* కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ గుట్టు విప్పేందుకు శాస్త్రవేత్తలు నిరంతం కృషి చేస్తున్నారని మోదీ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ స్వీయ అవగాహనతో క్రమశిక్షణగా ఉండాలని సూచించారు. 

* వచ్చే ఏడాది విద్యార్థుల కోసం ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని తెలిపారు. పరీక్షల సందర్భంగా జరిగే ఈ కార్యక్రమంలో 9-12 తరగతి విద్యార్థులకు ఈసారి ఆన్‌లైన్‌లో కొన్ని పోటీలు కూడా ఉండనున్నాయని తెలిపారు. దీనికోసం త్వరలో రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానుందన్నారు.

* కొత్త సంవత్సరంలో పుస్తక పఠనాన్ని మరింత ఆసక్తిగా మారుద్దామని ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు. ఈ ఏడాది చదవాలనుకుంటున్న పుస్తకాలను ఇతరులతో పంచుకోవాలని సూచించారు. తద్వారా ప్రతిఒక్కరికీ కొత్త సంవత్సరంలో చదవాల్సిన పుస్తకాల జాబితా సిద్ధమవుతుందన్నారు.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని