గాజీపుర్‌కు విపక్ష బృందం.. అడ్డుకున్న పోలీసులు

దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన సాగిస్తున్న రైతులను కలిసేందుకు ప్రతిపక్ష పార్టీ ఎంపీల బృందం నేడు దిల్లీ-యూపీ సరిహద్దులోని గాజీపుర్‌ చేరుకుంది. అయితే వీరిని ధర్నా ప్రాంతానికి వెళ్లకుండా

Published : 04 Feb 2021 11:37 IST

దిల్లీ: దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన సాగిస్తున్న రైతులను కలిసేందుకు ప్రతిపక్ష పార్టీ ఎంపీల బృందం నేడు దిల్లీ-యూపీ సరిహద్దులోని గాజీపుర్‌ చేరుకుంది. అయితే, వీరిని ధర్నా ప్రాంతానికి వెళ్లకుండా ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. 

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న అన్నదాతలకు సంఘీభావం తెలిపేందుకు 10 పార్టీలకు చెందిన 15 మంది ఎంపీలు గురువారం ఉదయం గాజీపుర్‌ చేరుకున్నారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, డీఎంకే ఎంపీ కనిమొళి, తృణమూల్‌ ఎంపీ సౌగతా రాయ్‌, శిరోమణి అకాలీదళ్‌ ఎంపీ హర్‌ సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ తదితరులు ఉన్నారు. అయితే, గాజీపుర్ ధర్నా ప్రాంతానికి వెళ్లేందుకు దిల్లీ పోలీసులు వీరికి అనుమతిచ్చినప్పటికీ.. యూపీ పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీలు రైతులను కలిసేందుకు నిరాకరించారు. దీంతో రైతులతో మాట్లాడకుండానే విపక్ష బృందం వెనుదిరిగింది.

పోలీసులు తీరును ఎంపీలు తీవ్రంగా ఖండించారు. ‘గాజీపుర్‌ సరిహద్దు వద్ద పరిస్థితులు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. అన్నదాతల పట్ల వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరం. కాంక్రీట్‌ బారికేడ్లు, వైర్‌ ఫెన్సింగ్‌ల మధ్య రైతులను ఉంచారు. కనీసం అంబులెన్స్‌లు, అగ్నిమాపక యంత్రాలను కూడా ధర్నాస్థలిని వెళ్లనివ్వడం లేదు. పార్లమెంట్‌లో రైతుల అంశాన్ని లేవనెత్తనివ్వడం లేదు. అందుకే, ఇక్కడి పరిస్థితులను తెలుసుకుందామని వస్తే మమ్మల్ని 3 కిలోమీటర్ల దూరంలోనే అడ్డుకున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడేందుకు కనీసం ఎంపీలకు కూడా అనుమతినివ్వడం లేదు. ప్రజాస్వామ్యంలో ఇది నిజంగా చీకటి రోజు’ అని ఎంపీ హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. 

ఇవీ చదవండి..

సాగు చట్టాలపై భారత్‌కు అమెరికా మద్దతు

దిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని