healthy snacks: స్నాక్స్‌ అంటే లొట్టలేస్తాం.. లేబుల్‌ చదివాకే పొట్టలోకేస్తాం

భారతీయుల్లో ఆరోగ్యకరమైన చిరుతిళ్లపై శ్రద్ధ పెరుగుతోంది. 73 శాతం మంది తాము చిరుతిళ్లు కొనుగోలు చేసే సమయంలో ప్యాకెట్‌పై ముద్రించిన ముడి పదార్థాల (ఇంగ్రిడియంట్స్‌) జాబితా, పోషక విలువల వివరాలను క్షుణ్నంగా తెలుసుకుంటున్నట్లు ‘ది హెల్దీ స్నాకింగ్‌ రిపోర్ట్‌-2024’ నివేదిక తేల్చింది.

Updated : 08 Jul 2024 09:14 IST

ఆరోగ్యకరమైన చిరుతిళ్లపై భారతీయుల్లో పెరుగుతున్న శ్రద్ధ
ముడి పదార్థాలు, పోషక విలువలు తెలుసుకున్నాకే కొనుగోలు
మఖానా, డ్రైఫ్రూట్స్‌పై యువత మోజు

భారతీయుల్లో ఆరోగ్యకరమైన చిరుతిళ్లపై శ్రద్ధ పెరుగుతోంది. 73 శాతం మంది తాము చిరుతిళ్లు కొనుగోలు చేసే సమయంలో ప్యాకెట్‌పై ముద్రించిన ముడి పదార్థాల (ఇంగ్రిడియంట్స్‌) జాబితా, పోషక విలువల వివరాలను క్షుణ్నంగా తెలుసుకుంటున్నట్లు ‘ది హెల్దీ స్నాకింగ్‌ రిపోర్ట్‌-2024’ నివేదిక తేల్చింది.

దిల్లీ: ఆహార పదార్థాల కల్తీ ఘటనలు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ప్రజల ఆహార ఎంపికలను తెలుసుకొనే లక్ష్యంతో ప్రముఖ స్నాక్స్‌ తయారీ సంస్థ ఫార్మ్‌లే ఈ నివేదికను సిద్ధం చేసింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా దాదాపు 6 వేల మందిని సర్వే చేశారు. లేబుళ్లను చదివే 73 శాతం మందిలో 93 శాతం మంది ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల వైపు మళ్లడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అందుకోసమే లేబుళ్లను చదవడం ద్వారా తినబోయే ఆహారంలో హానికర పదార్థాలు లేకుండా జాగ్రత్త పడుతున్నట్లు వెల్లడించారు. సర్వేలో పాల్గొన్న ప్రతి 10 మందిలో 9 మంది సంప్రదాయ చిరుతిళ్ల స్థానంలో ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తున్నట్లు చెప్పారు. ఈ నివేదిక ప్రకారం 60 శాతం మంది భారతీయులు పప్పు గింజలు, ముడి ధాన్యాల్లాంటి సహజమైన చిరుతిళ్ల వైపు మొగ్గుతున్నారు. పోషక విలువలు పుష్కలంగా ఉండే మఖానా, డ్రైఫ్రూట్స్‌ యువత మనసు దోచుకుంటూ చిరుతిళ్లలో రారాజుగా వెలుగొందుతున్నాయి. 67 శాతం మంది భారతీయులు వాటిని ఎంచుకుంటున్నారు. వారిలో 59 శాతం మంది మిలినియల్స్, 49 శాతం మంది జెన్‌-జెడ్, 47 శాతం మంది  జెన్‌-ఎక్స్‌ తరం వారు ఉన్నారు. సాయంత్రం టీ లేదా కాఫీ తాగే సమయంలో స్నాక్స్‌ తినడం తమకు ఇష్టమని 70 శాతం మంది చెప్పారు. అయితే ఆరోగ్యకరమైన స్నాక్స్‌ కొనడానికి ఎక్కువ చెల్లించాల్సి వస్తోందని, అందువల్లే వాటిని కొనుగోలు చేయడం భారంగా ఉందని 58 శాతం మంది తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని