GST: కొన్ని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారంలో జాప్యం.. అసలు కారణమిదే..: నిర్మలా సీతారామన్‌

కొన్ని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం(GST compensation) చెల్లింపు ఆలస్యం అవుతుండటానికి అసలు కారణాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

Published : 13 Feb 2023 15:43 IST

దిల్లీ: జీఎస్టీ పరిహారం(GST compensation) చెల్లింపుల్లో కేంద్రం జాప్యం చేస్తోందంటూ పలు రాష్ట్రాలు విమర్శిస్తున్న వేళ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitharaman) సమాధానమిచ్చారు. ఇదే అంశంపై లోక్‌సభ(Lok Sabha)లో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు సోమవారం ఆమె సమాధానమిచ్చారు. ఆయా రాష్ట్రాలు ఏజీ (అకౌంటెంట్‌ జనరల్‌) సర్టిఫికేట్‌ను సమర్పించకపోవడం వల్లే జీఎస్టీ పరిహారం చెల్లింపు ఆలస్యమవుతోందని వెల్లడించారు. 2017-18 నుంచి కేరళ ప్రభుత్వం ఒక్కసారి కూడా అలాంటి సర్టిఫికేట్‌ ఏదీ సమర్పించలేదన్న నిర్మలమ్మ.. గతేడాది మే 31 నాటికి అన్ని రాష్ట్రాలకు రూ.86,912 కోట్లు మేర జీఎస్టీ పరిహారం విడుదల చేసినట్టు తెలిపారు. జీఎస్టీ పరిహారాన్ని ఎవరికి విడుదల చేయాలనేది చట్ట ప్రకారం జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తుంది తప్ప కేంద్ర ప్రభుత్వం కాదన్నారు. రాష్ట్రాలు, కేంద్రం మధ్య ఈ చెల్లింపుల ప్రక్రియకు ఏజీ ధ్రువీకరణ పత్రం తప్పనిసరని.. ఇది అంగీకరించిన ప్రక్రియేనన్నారు. 

ఒకవేళ ఏజీ సర్టిఫికెట్‌ను పొందడంలో ఏదైనా ఆలస్యం జరిగితే.. అది ఏజీ, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని.. వారే సరిచేసుకోవాలన్నారు. వారి మధ్య ఏవైనా ఇబ్బందులు ఉంటే సర్టిఫికెట్‌ కేంద్రానికి చేరడంలో ఆలస్యం జరుగుతుండం వల్లే జీఎస్టీ పరిహారం బకాయి పడుతోందని తెలిపారు. కేరళ రాష్ట్రాన్ని ప్రస్తావిస్తూ.. జీఎస్టీ పరిహారం బకాయిల కోసం 2017-18 నుంచి 2020-21వరకు ఒక్కసారి కూడా ఆ రాష్ట్రం ఏజీ సర్టిఫికెట్‌ను పంపించలేదని తెలిపారు. అయినా.. కేంద్రం సకాలంలో బకాయిలు విడుదల చేయడంలేదని నిందిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒకసారి కూర్చొని ఏజీ సర్టిఫికేట్‌ను పంపించాలని కోరాలని ఈ అంశంపై అనుబంధ ప్రశ్న సంధించిన కేరళ ఎంపీ ఎన్‌కే ప్రేమ్‌చంద్రన్‌కు సూచించారు. సహేతుకమైన సమయంలో ఆ సర్టిఫికేట్లను స్వీకరించాక బకాయిలను క్లియర్‌ చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. తమిళనాడు ప్రభుత్వం 2017-18కి సంబంధించి ఏజీ సర్టిఫికెట్‌ ఇచ్చాక నిధులు విడుదల చేశామన్నారు. అదే రాష్ట్రం నుంచి 2020-21 గాను రూ.4,223 కోట్ల పరిహారానికి సంబంధించి ఏజీ సర్టిఫికెట్లు రాగా.. అక్కడ కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ ప్రాసెస్‌ చేశామని.. బకాయిలను క్లియర్‌ చేస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని