Moonlighting: పేదపిల్లల చదువు కోసం కూలీగా మూన్‌లైటింగ్‌

ఒడిశాకు  చెందిన నగేశు పాత్రో ఓ అతిధి అద్యాపకుడు. కానీ, పేద పిల్లల కోసం నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్‌ సెంటర్‌ కోసం ఆయన కూలీగా కూడా పనిచేస్తున్నారు. వచ్చిన సొమ్మును టీచర్లకు జీతాలుగా చెల్లిస్తున్నారు.

Updated : 11 Dec 2022 15:20 IST

బరంపూర్‌: ఈ మధ్య చాలా మంది అదనపు ఆదాయం కోసం మూన్‌లైటింగ్‌ చేస్తున్నారు. అంటే ఒక ప్రధాన ఉద్యోగంతో పాటు ఖాళీ సమయాల్లో మరో పనిచేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా.. వీరంతా డిమాండ్‌ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకుందామని ఇలా చేస్తున్నారు. ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన సిహెచ్‌ నగేశు పాత్రో (Nageshu Patro) కూడా మూన్‌లైటింగ్‌ చేస్తున్నారు. కానీ, ఆయన కథ మాత్రం చాలా భిన్నమైంది. పాత్రో చేస్తున్న రెండో ఉద్యోగం రైల్వే స్టేషన్‌లో కూలీ పని. పైగా ఆయన చేస్తున్నది తన జేబు నింపుకోవడానికి మాత్రం కాదు. మరి ఆయన ఎవరి కోసం కూలీగా మారారు? ప్రధాన ఉద్యోగం ఏంటి? వంటి ఆసక్తికర అంశాలు చూద్దాం..

నగేశు పాత్రో (Nageshu Patro)ది ఒడిశాలోని గంజాం జిల్లా. ఆయన ప్రైవేటు కాలేజీలో అతిథి అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. పేద పిల్లల కోసం ఓ ఉచిత కోచింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దాంట్లో బోధించేవారికి జీతాలిచ్చేందుకు తన ఆదాయం సరిపోవడం లేదు. దీంతో రాత్రివేళల్లో బరంపూర్‌ రైల్వే స్టేషన్‌లో కూలీ పనికి వెళ్తున్నారు. కొవిడ్‌ మహమ్మారి సమయంలో ఖాళీగా ఉండే బదులు పేద పిల్లలకు ఉచితంగా బోధించడం ప్రారంభించానని పాత్రో తెలిపారు. క్రమంగా పిల్లల సంఖ్య పెరగడంతో ఎనిమిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్‌ కేంద్రాన్ని తెరిచారు. స్వయంగా హిందీ, ఒడియా బోధిస్తున్నారు. మిగిలిన సబ్జెక్టుల కోసం ఇతరులను నియమించుకున్నారు.

ప్రస్తుతం ఆయన దగ్గర నలుగురు టీచర్లు పనిచేస్తున్నారు. వారికి నెలకు రూ.10,000 నుంచి రూ.12,000 వరకు చెల్లిస్తున్నారు. ఈ మొత్తాన్నే ఆయన కూలీగా పనిచేస్తూ సంపాదిస్తున్నారు. అతిథి అధ్యాపకుడిగా ఆయన రూ.8,000 ఆర్జిస్తున్నారు. ఆ మొత్తంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. పాత్రోకు తల్లి, తండ్రి ఉన్నారు. వారు గంజాం జిల్లా మనోహర్‌ గ్రామంలో నివసిస్తున్నారు. కూలీగా పనిచేయడానికి తనకు ఏమాత్రం బిడియంగా లేదని పాత్రో అంటున్నారు. తనకు బోధన అంటే ఇష్టమని.. ఎవరు ఏమనుకున్నా పేదపిల్లల కోసం కూలీ పని చేస్తూనే ఉంటానన్నారు. 

తాను చేస్తున్న ఈ పనికి ప్రేరణ ఏంటని పాత్రోను ప్రశ్నించగా.. చదువుకోవడానికి తాను పడ్డ కష్టాలేనని చెబుతున్నారు. తన తండ్రి గతంలో గొర్రెలకాపరిగా ఉండేవారని.. దీంతో కుటుంబం గడవడం కూడా కష్టంగా ఉండేదన్నారు. దీంతో 2006లో తాను హెచ్‌ఎస్‌సీ పరీక్షకు హాజరుకాలేకపోయానని తెలిపారు. కానీ, చదువుపై ఉన్న మక్కువతో దూరవిద్య ద్వారా 2012లో 12వ తరగతి పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యారు. తర్వాత డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం బరంపూర్‌ విశ్వవిద్యాలయం నుంచి పీజీ పట్టా అందుకున్నారు. చదువుకు అయ్యే ఖర్చును రాత్రివేళ కూలీగా చేస్తూనే సమకూర్చుకున్నారు. పేద పిల్లలెవరూ చదువుకోవడానికి తనలా కష్టపడొద్దనే కోచింగ్‌ సెంటర్‌ను ప్రారంభించానని పాత్రో తెలిపారు.

ఈ మధ్య రైల్వే స్టేషన్లలో ట్రాలీ బ్యాగ్‌లు, ఎస్కలేటర్లు విరివిగా వినియోగిస్తున్నారని పాత్రో తెలిపారు. దీంతో కూలీల ఆదాయం పడిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో కష్టపడి పనిచేస్తున్న రైల్వే కూలీల కోసం ఏదైనా చేయాలని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని