Anant Ambani Wedding: దేశాధినేతలు, మాజీ ప్రధానులు, సీఈఓలు, రియాల్టీ స్టార్లు.. అంబానీల గెస్ట్ లిస్ట్ ఇదే..!

Anant Ambani-Radhika Merchant wedding: అనంత్ అంబానీ వివాహం వేళ.. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం అతిథులతో కళకళలాడనుంది. దేశవిదేశాల నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. 

Published : 11 Jul 2024 16:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ వివాహ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు జరిగిన ముందస్తు వేడుకలకు ప్రపంచస్థాయి అతిథులు హాజరయ్యారు. జులై 12న జరగనున్న పెళ్లికి దేశవిదేశాలకు చెందిన అతిథులకు ఆహ్వానం అందింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం..

ముంబయిలోని బాంద్రా కుర్లా సెంటర్‌ (BKC)లోని జియో వరల్డ్ సెంటర్‌లో అనంత్-రాధికా మర్చంట్ వివాహం జరగనుంది. దీనికి బ్రిటన్ మాజీ ప్రధానులు టోనీ బ్లెయిర్, బోరిస్ జాన్సన్ రానున్నారని సమాచారం. అమెరికన్ రియాలిటీ స్టార్లు కిమ్ కర్దాషియన్‌, ఖ్లో కర్దాషియన్‌, లైఫ్‌కోచ్‌ జేశెట్టి, యూఎస్‌ విదేశాంగశాఖ మాజీమంత్రి జాన్‌ కెర్రీ, స్వీడన్ మాజీ ప్రధాని కార్ల్‌ బిడ్త్‌, కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్‌, టాంజానియా అధ్యక్షుడు సామియ సులుహు హస్సన్‌, ఐఓసీ ఉపాధ్యక్షుడు జాన్ ఆంటోనియో, ఫిఫా అధ్యక్షుడు గియన్ని ఇన్‌ఫాంటినో వంటి ప్రముఖులు రానున్నారు.

అంబానీల ఇంట పెళ్లి సందడి : అతిథులను తరలించేందుకు 3 ఫాల్కన్‌ జెట్‌ విమానాలు

ఇక వ్యాపార రంగం నుంచి హెచ్‌ఎస్‌బీసీ ఛైర్మన్‌ మార్క్‌ టకర్‌, అరామ్కో సీఈఓ అమిన్‌ నాస్సర్‌, మోర్గాన్‌స్టాన్లీ ఎండీ మైఖెల్ గ్రిమ్స్‌, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్‌, ముబాదలా ఎండీ ఖల్దూన్‌ ఆల్‌ ముబారక్‌, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఛైర్మన్‌ జేలీ, లాక్‌హీడ్‌ మార్టిన్‌ సీఈఓ, బీపీ సీఈఓ, ఎరిక్సన్‌ సీఈఓ, కువైట్ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ ఎండీ బదెర్‌ మొహమ్మద్‌ అల్‌సయీద్, నోకియా ప్రెసిడెంట్ టామీ ఉయిటో సహా ఇంకా పలు ప్రపంచస్థాయి సంస్థల ఛైర్మన్‌లు, ఎండీలు, సీఈఓలు అంబానీల ఆతిథ్యం అందుకోనున్నారని తెలుస్తోంది. ఇదిలాఉంటే.. రేపటి నుంచి మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరగనున్నాయి. జులై 12న ముఖ్య ఘట్టమైన ‘శుభ్‌ వివాహ్‌’తో మొదలయ్యే ఈ సెలబ్రేషన్స్‌.. జులై 13న ‘శుభ్‌ ఆశీర్వాద్‌’, జులై 14న ‘మంగళ్‌ ఉత్సవ్‌’తో ముగుస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని