విదేశీ ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు.. 7 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి

ఒమిక్రాన్‌ వ్యాప్తితో దేశంలో కరోనా ఉద్ధృతి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు ప్రస్తుతం

Updated : 07 Jan 2022 16:43 IST

దిల్లీ: ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగా దేశంలో కరోనా ఉద్ధృతి మళ్లీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు ప్రస్తుతం అమలు చేస్తోన్న మార్గదర్శకాలను సవరించింది. ఇందులో భాగంగానే ముప్పు ఎక్కువ ఉన్న ఎట్‌ రిస్క్‌ దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి  నుంచి వచ్చే ప్రయాణికులు భారత్‌కు వచ్చిన తర్వాత తప్పనిసరిగా 7 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించింది. ఎనిమిదో రోజు కరోనా పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు జనవరి 11 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఎట్‌ రిస్క్‌’ దేశాలివే..

ఒమిక్రాన్ వ్యాప్తితో పాటు కొవిడ్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న దేశాలను కేంద్రం ఎట్ రిస్క్‌ దేశాలుగా పరిగణించింది. అందులో యూకే సహా ఐరోపా దేశాలు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, బోట్స్‌వానా, చైనా, ఘనా, మారిషస్‌, న్యూజిలాండ్‌, జింబాబ్వే, టాంజానియా, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌, కాంగో, ఇథియోపియా, కజఖ్‌స్థాన్‌, కెన్యా, నైజీరియా, టునీషియా, జాంబియా దేశాలున్నాయి.

విదేశీ ప్రయాణికులకు కేంద్రం తాజా మార్గదర్శకాలివే..

* విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫామ్‌ను నింపాలి. 

* ప్రయాణికులు తప్పనిసరిగా తమ ప్రయాణానికి ముందు(72 గంటలు దాటకూడదు) ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలి. నెగెటివ్‌ పత్రాన్ని అప్‌లోడ్‌ చేయాలి. 

* సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫామ్‌లో పూర్తి సమాచారం ఇచ్చిన వారినే విమానంలోకి ఎక్కేందుకు అనుమతించాలి.

* ‘ముప్పు ఉన్న’ దేశాల నుంచి వచ్చే వారికి.. భారత్‌ చేరుకున్న తర్వాత కరోనా పరీక్షలు ఉంటాయన్న సమాచారాన్ని ఎయిర్‌లైన్లు ప్రయాణికులకు తెలియజేయాలి. 

* ఈ పరీక్షల కోసం ప్రయాణికులు ముందుగానే ఎయిర్ సువిధ పోర్టల్‌లో బుకింగ్‌ చేసుకోవచ్చు. 

* ‘ఎట్‌ రిస్క్‌’ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టు పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినప్పటికీ 7 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. 8వ రోజు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి. ఆ రిపోర్ట్‌ను ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

* ఇక, పాజిటివ్‌ వస్తే వారు ప్రొటోకాల్స్‌ ప్రకారం ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఉండాలి. వారి శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించాలి. 

* ‘ఎట్‌ రిస్క్’ కాని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులక ఎయిర్‌పోర్టుల్లో రాండమ్‌ పరీక్షలు చేయాలి.

* ‘వీరిలో నెగెటివ్‌ వచ్చిన ప్రయాణికులు కూడా 7 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. ఎనిమిదో రోజు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలి. వీరు కూడా తమ రిపోర్ట్‌ను ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. 

* ఒక వేళ పాజిటివ్‌ వస్తే.. వీరి శాంపిల్స్‌ను కూడా జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించాలి. 

గురువారం ఇటలీ నుంచి వచ్చిన పంజాబ్‌ వచ్చిన ఓ ఛార్టర్డ్‌ విమానంలో 125 మంది ప్రయాణికులకు ఎయిర్‌పోర్టు పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం విదేశీ ప్రయాణికులకు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని