‘కార్గిల్‌ హీరోలకు థ్యాంక్స్’: జవాన్లకు 25వేల గ్రీటింగ్స్‌!

కార్గిల్‌లో ఉన్న జవాన్ల గౌరవార్థం గుజరాత్‌ రాష్ట్ర ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘గుజరాత్‌ థాంక్స్‌ కార్గిల్‌ హీరోస్‌’ పేరిట క్యాంపెయిన్‌ను......

Published : 04 Jul 2021 01:43 IST

అహ్మదాబాద్‌: కార్గిల్‌లో పహారా కాస్తున్న జవాన్ల గౌరవార్థం గుజరాత్‌ రాష్ట్ర ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘గుజరాత్‌ థాంక్స్‌ కార్గిల్‌ హీరోస్‌’ పేరిట క్యాంపెయిన్‌ను ప్రారంభించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా కార్గిల్‌లో మోహరించిన సైనికులకు ఎన్‌సీసీ క్యాడెట్లు 25వేల గ్రీటింగ్‌ కార్డులను పంపనున్నారు. ఈ నెల 26న కార్గిల్‌ దివస్‌ 22వ వార్షికోత్సవానికి గుర్తుగా ఈ గ్రీటింగ్‌ కార్డులను పంపాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. గుజరాత్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  మే1న ఎన్‌సీసీ ప్రారంభించిన ‘ఏక్ మెయిన్ సౌ కే లియే’ క్యాంపెయిన్‌ ఐదో దశలో భాగంగా ఈ క్యాంపెయిన్‌ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.

అయితే, ఈ క్యాంపెయిన్‌ విజయవంతం కావడంపై లండన్‌కు చెందిన వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు సర్టిఫికెట్‌ ఆఫ్‌ కమిట్‌మెంట్‌ను ప్రదానం చేసింది. మరోవైపు, గాంధీనగర్‌ నుంచి ఐదో దశ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన సీఎం విజయ్‌ రూపానీ.. వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సర్టిఫికెట్‌ను ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ అదనపు డైరెక్టర్‌ మేజర్‌ జనరల్‌ అరవింద్‌ కపూర్‌కు అందజేశారు. రాష్ట్రంలో 65వేల మంది యువత ఎన్‌సీసీలో చేరడం గర్వంగా ఉందన్నారు. పోలీస్‌ నియామకాల్లో ఎన్‌సీసీ ‘సీ’ సర్టిఫికెట్‌ ఉన్నవారికి ప్రాధాన్యం కల్పించనున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు పూర్తయిన నాలుగు దశల క్యాంపెయిన్‌లో భాగంగా ఒక్కో ఎన్‌సీసీ క్యాడెట్‌ 100 మంది బంధువులు, స్నేహితుల్లో కరోనా నిబంధనలపై అవగాహన కల్పించడంతో పాటు వృద్ధుల పట్ల ప్రేమను చాటేందుకు వృద్ధాశ్రమాలను సందర్శించారని అధికారులు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు