Gujarat High Court: విచారణలో కూల్డ్రింక్ తాగిన పోలీస్.. జడ్జి వినూత్న శిక్ష!

కేసు విచారణ సమయంలో ఇన్​స్పెక్టర్ ఏఎం రాథోడ్ శీతలపానీయం తాగుతున్నట్టు గమనించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్......

Published : 16 Feb 2022 01:44 IST

అహ్మదాబాద్‌: ఓ కేసు విషయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో న్యాయవాదులు తమ వాదోపవాదాలను వాడీవేడిగా వినిపిస్తున్నారు. ఇరుపక్షాల వాదనలను న్యాయమూర్తి శ్రద్ధగా వింటున్నారు. ఈ క్రమంలోనే ఓ పోలీసు అధికారి కూల్‌ డ్రింక్‌ తాగుతూ జడ్జి కంటికి చిక్కారు. దీంతో కాస్త అసహనానికి గురైన న్యాయమూర్తి సదరు పోలీసు అధికారికి వినూత్నంగా శిక్ష విధించారు. ఈ సంఘటన గుజరాత్ హైకోర్టులో వర్చువల్​ విచారణ సమయంలో చోటుచేసుకుంది.

కేసు విచారణ సమయంలో ఇన్​స్పెక్టర్ ఏఎం రాథోడ్ శీతలపానీయం తాగుతున్నట్టు గమనించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ ఆ అధికారిని మందలించారు. బార్ అసోసియేషన్​కు ఓ వంద కూల్ డ్రింక్ టిన్నులను పంపిణీ చేయాలని ఆదేశించారు. లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన ఓ సంఘటనను న్యాయమూర్తి గుర్తుచేశారు. ‘గతంలోనూ ఓ న్యాయవాది ఆన్​లైన్ విచారణలో సమోసా తింటూ కనిపించారు. సమోసా తినడంలో తప్పు లేదు. కానీ విచారణ జరుగుతుండగా.. మా ముందు తినడం సరికాదు. ఇక్కడ చాలా మంది ఉంటారు. వారికీ తినాలని ఉంటుంది కదా! మీరు తినాలనుకుంటే ముందు తోటివారికి ఇవ్వండి. లేదంటే మీరూ తినకూడదు’ అని పేర్కొన్నారు.

అయితే న్యాయమూర్తి సంభాషణ చాలా సరదాగానే సాగిందని విచారణలో పాల్గొన్న ప్రభుత్వ న్యాయవాది ఒకరు తెలిపారు. ‘ఒక్కరే తినకుండా అందరితో పంచుకోవాలని న్యాయమూర్తి సూచించారు. గతంలో ఓ న్యాయవాదినీ ఇలాగే ఆదేశించారు. అందరికీ సమోసాలు పంచి పెట్టాలని చెప్పారు’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని