Tiranga Yatra: తిరంగా యాత్ర పైకి దూసుకెళ్లిన ఆవు.. గాయపడ్డ మాజీ ఉపముఖ్యమంత్రి

గుజరాత్‌లో నిర్వహించిన ‘తిరంగా యాత్ర’లో అపశ్రుతి చోటుచేసుకుంది. యాత్రలో పాల్గొన్న నేతలపైకి ఓ ఆవు దూసుకెళ్లగా.. ఆ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ గాయపడ్డారు........

Published : 14 Aug 2022 02:59 IST

దిల్లీ: గుజరాత్‌లో నిర్వహించిన ‘తిరంగా యాత్ర’లో అపశ్రుతి చోటుచేసుకుంది. యాత్రలో పాల్గొన్న నేతలపైకి ఓ ఆవు దూసుకెళ్లగా.. ఆ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ గాయపడ్డారు. ఆయన ఎడమ కాలికి ఫ్రాక్చర్‌ అయినట్లు భాజపా వర్గాలు తెలిపాయి. స్వాతంత్య్రం పొంది 75 సంవత్సరాలు గడుస్తోన్న వేళ.. మెహ్‌సనా జిల్లాలో నిర్వహించిన తిరంగా యాత్రలో నితిన్‌ పటేల్‌ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

దాదాపు రెండు వేల మంది హాజరైన ఈ యాత్ర అప్పటికే 70శాతం ముగిసింది. ఆ ర్యాలీ ఓ కూరగాయల మార్కెట్‌ వద్దకు చేరుకోగా.. ఉన్నట్టుండి ఓ ఆవు ఆ గుంపులోని దూసుకొచ్చింది. దీంతో నితిన్‌ పటేల్‌ సహా పలువురు కిందపడిపోయారు. మాజీ ఉపముఖ్యమంత్రిని ఆసుపత్రికి తరలించగా.. ఆయన కాలికి ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. 20-25రోజుల విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆవు ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది.

దేశం స్వాతంత్య్రం పొంది 75 సంవత్సరాలు గడుస్తోన్న వేళ.. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమం కింద హర్‌ఘర్ తిరంగా ఉత్సవంలో దేశ ప్రజలు పాల్గొంటున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలు ఎగరేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ పిలుపునందుకొని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఇతర మంత్రులు, ప్రజలు శనివారం తమ ఇళ్లపై జెండా ఎగరేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని