Rahul Gandhi: రాహుల్‌ పరువు నష్టం కేసు.. విచారణ నుంచి వైదొలిగిన జడ్జి!

పరువు నష్టం కేసులో సూరత్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) గుజరాత్ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ నుంచి న్యాయమూర్తి అనూహ్యంగా వైదొలిగారు. 

Published : 26 Apr 2023 23:26 IST

అహ్మదాబాద్‌: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) గుజరాత్‌ హైకోర్టు (Gujarat High Court)ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణను జస్టిస్‌ గీతా గోపి ధర్మాసనానికి గుజరాత్ హైకోర్టు కేటాయించింది. అయితే, కేసు విచారణ బాధ్యతల నుంచి జస్టిస్‌ గీతా గోపి అనూహ్యంగా వైదొలిగారు. ఈ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆమె సూచించారు. బుధవారం రాహుల్‌ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను ముందుగా విచారణ జరపాలని ఆయన తరఫు న్యాయవాది పీఎస్‌ చాపనెరి, జస్టిస్‌ గీతా గోపి ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని ఆమె సూచించినట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో పిటిషన్‌పై ఏ ధర్మాసనం విచారణ చేపడుతుందనే దానిపై స్పష్టత వస్తుందని పీఎస్‌ చాపనెరి తెలిపారు. 

మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు గాను దాఖలైన పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ సూరత్‌లోని ట్రయల్‌ కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఈ నేపథ్యంలో ట్రయల్‌ కోర్టు తీర్పును రాహుల్‌ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టులో సవాల్‌ చేశారు. రెండేళ్ల జైలు శిక్షను నిలుపుదల చేయాలని.. అలాగే తనను దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును సైతం నిలిపివేయాలంటూ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఏప్రిల్‌ 3న విచారణ చేపట్టిన కోర్టు.. ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. తదుపరి విచారణలో భాగంగా ఏప్రిల్‌ 13న ఇరు పక్షాల వాదనలు విని 20న తీర్పు వెలువరించింది. తాజాగా దీనిని సవాల్‌ చేస్తూ రాహుల్‌ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని