Bridge Tragedy: మోర్బీ ఘటన.. బ్రిడ్జ్‌ ఒప్పందాన్ని ఒకటిన్నర పేజీల్లో పూర్తి చేశారా..?

గుజరాత్‌లో మోర్బీ తీగల వంతెన కూలిన ఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది. మరమ్మతుల అనంతరం ఈ వంతెనను తెరిచిన కొద్ది రోజులకే కూలిపోవడం కలకలం రేపింది. దీనిపై తాజాగా హైకోర్టు విచారణ చేపట్టింది.

Updated : 15 Nov 2022 15:02 IST

మోర్బీ: తీవ్ర విషాదం నింపిన మోర్బీ తీగల వంతెన దుర్ఘటనపై మంగళవారం గుజరాత్‌ హైకోర్టు ఘాటుగా స్పందించింది. బ్రిడ్జ్‌ మరమ్మతు, నిర్వహణ కోసం కాంట్రాక్టు ఇచ్చిన తీరును తీవ్రంగా తప్పుపట్టింది. ‘ఆ పర్యాటక బ్రిడ్జ్‌ మరమ్మతు కోసం ఎందుకు టెండర్ వేయలేదు? బిడ్స్ ఎందుకు ఆహ్వానించలేదు? నిబంధనల విషయంలో మున్సిపల్ అధికారులు సరిగా వ్యవహరించకపోవడం వల్ల సుమారు 135 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ కాంట్రాక్టు ఒప్పందాన్ని ఒకటిన్నర పేజీల్లో ఎలా పూర్తి చేశారు? ఎలాంటి టెండర్ వేయకుండానే అజంతా సంస్థకు పనులు ఎలా అప్పగించారు? గుజరాత్ మున్సిపాలిటీ యాక్ట్‌(1963)లోని నిబంధనలు పాటించారా?’ అంటూ గుజరాత్ చీఫ్ సెక్రటరీని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వరుస ప్రశ్నలు వేశారు. తాజాగా ఈ ఘటనపై విచారణ జరిగింది.  

మోర్బీ తీగల వంతెన ఘటనను హైకోర్టు సుమోటోగా విచారణకు తీసుకుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానిక అధికారులకు నోటీసులు ఇచ్చింది. ఇక ఇప్పటివరకు ఆ కాంట్రాక్టు కంపెనీకి చెందిన కొంతమంది సిబ్బంది అరెస్టయ్యారు. ఈ ఒప్పందంపై సంతకం చేసిన సంస్థ ఉన్నతాధికారులపై ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. 

మరమ్మతుల అనంతరం వంతెనను తెరిచిన కొద్ది రోజులకే కూలిపోవడం కలకలం రేపింది. మరమ్మతు బాధ్యతలను గుజరాత్‌కు చెందిన ఒరెవా గ్రూప్‌ తీసుకుంది. సీఎఫ్‌ఎల్‌ బల్బులు, గోడ గడియారాలు, ఈ-బైక్‌లు తయారీకి పేరు పొందిన ఈ సంస్థకు నిర్మాణ రంగంలో అసలు అనుభవమే లేకపోవడం గమనార్హం. అజంతా సంస్థ ఈ గ్రూప్‌లో భాగమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని