Jignesh Mevani: జిగ్నేశ్‌ మేవాణీకి మూడు నెలల జైలు శిక్ష.. ఏ కేసులో అంటే!

అయిదేళ్ల క్రితం నాటి ఓ కేసులో గుజరాత్‌కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవాణీకి జైలు శిక్ష పడింది. 2017లో అనుమతి లేకుండా 'ఆజాదీ మార్చ్' నిర్వహించారనే కేసులో గురువారం ఇక్కడి మెజిస్టీరియల్‌ కోర్టు.. ఆయనతోపాటు...

Published : 06 May 2022 02:10 IST

గాంధీనగర్‌: అయిదేళ్ల క్రితం నాటి ఓ కేసులో గుజరాత్‌కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవాణీకి జైలు శిక్ష పడింది. 2017లో అనుమతి లేకుండా 'ఆజాదీ మార్చ్' నిర్వహించారనే కేసులో గురువారం ఇక్కడి మెజిస్టీరియల్‌ కోర్టు.. ఆయనతోపాటు మరో 11 మందిని దోషులుగా నిర్ధారించింది. వారికి మూడు నెలల జైలు శిక్షతోపాటు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించింది. దోషుల్లో ఎన్‌సీపీ కార్యకర్త రేష్మా పటేల్, మేవానీకి చెందిన రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్‌లోని సభ్యులు ఉన్నారు. అయితే.. శిక్ష ఖరారైన మొత్తం 12 మందిలో ఒకరు మరణించగా, మరొకరు పరారీలో ఉన్నారు.

ఉనా ఘటనకు ఏడాది పూర్తయిన సందర్భంగా జులై 2017లో మేవాణీ తదితరులు మెహ్సానా నుంచి బనస్కాంత జిల్లాలోని ధనేరా వరకు 'ఆజాదీ మార్చ్' చేపట్టారు. అయితే, అనుమతి లేకుండా ఈ కార్యక్రమం చేపట్టారంటూ మెహ్సానా 'ఎ’ డివిజన్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 143 కింద నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో వాదనలు విన్న అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జేఏ పర్మార్ నేడు ఈ మేరకు తీర్పు వెలువరించారు. ఇదిలా ఉండగా.. నేరపూరిత కుట్ర, వర్గాల మధ్య శత్రుత్వం పెంచడం, శాంతికి భంగం కలిగించేందుకు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం వంటి అభియోగాలపై జిగ్నేశ్‌పై ఇటీవల అస్సాంలో పలు కేసులు నమోదయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ను అస్సాం పోలీసులు అరెస్టు చేయగా.. ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని