Gujarat Tragedy: తీగల వంతెన కూలిన భయానక క్షణాలు.. సీసీటీవీ దృశ్యాలు బయటకు..!

గుజరాత్‌లో తీగల వంతెన కూలిన దుర్ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బ్రిడ్జి కూలడానికి ముందు కొందరు వంతెనను ఊపుతూ ఆకతాయి చేష్టలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Updated : 31 Oct 2022 12:37 IST

మోర్బీ: గుజరాత్‌లోని మోర్బీ నగరంలో మచ్చు నదిపై తీగల వంతెన కూలిన దుర్ఘటనకు మానవ తప్పిదాలే ప్రధాన కారణాలుగా కన్పిస్తున్నాయి. కేవలం 100 మందిని మాత్రమే మోయగల సామర్థ్యం ఉన్న వంతెనపైకి 400-500 మందిని అనుమతించడం.. కొందరు ఆకతాయి చేష్టలు చేయడం వల్లే వంతెన కూలినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అందులో సందర్శకులు వంతెనపై నిల్చుని ఉండగా.. కొందరు బ్రిడ్జిని ఊపుతూ కన్పించారు. ఆ వెంటనే వంతెన కుప్పకూలి అందరూ నదిలో పడిపోయారు.

వద్దని చెప్పినా వంతెనను ఊపుతూనే..

ఈ ప్రమాదం నుంచి అహ్మదాబాద్‌కు చెందిన విజయ్‌ గోస్వామి కుటుంబం తృటిలో మృత్యువును తప్పించుకుంది. నిన్న మధ్యాహ్నం గోస్వామి తన కుటుంబసభ్యులతో కలిసి తీగల వంతెనను చూసేందుకు వెళ్లారు. ‘‘వంతెనపై సగం దూరం వెళ్లేసరికి విపరీతమైన రద్దీ కన్పించింది. దీంతో పాటు కొందరు యువకులు ఉద్దేశపూర్వకంగా వంతెనను ఊపుతూ ఆకతాయి చేష్టలకు పాల్పడ్డారు. వద్దని వారించినా వారు వినిపించుకోలేదు. దీంతో ప్రమాదమని భావించి మేమంతా సగం నుంచి వెనక్కి వచ్చేశాం. ఈ విషయం గురించి బ్రిడ్జి నిర్వాహకులను కూడా అప్రమత్తం చేశాం. కానీ వారు పట్టించుకోలేదు. సాయంత్రానికే ఈ ఘోరం గురించి వినాల్సి వచ్చింది’’ అని గోస్వామి తెలిపారు. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 134 మంది మృతిచెందారు. ఘటనాస్థలంలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని